ఏపీకి తీవ్ర తుపాను ముప్పు... ఆ జిల్లాలకు భారీ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్పపీడనాలు ముంచేస్తున్నాయి. ఒకదాని తర్వాత మరొకటిగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతూ, అవి వాయుగుండాలుగా మారుతూ అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బుడమేరు పొంగి సగం విజయవాడ నగరం మునిగిపోయి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తరుణంలో బంగాళాఖాతంలో తీవ్ర తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం అదేరోజు సాయంత్రానికి బలపడి మంగళవారం ఉదయానికి వాయుగుండంగా మారింది.
తీవ్ర తుపానుగా మారే అవకాశం
బుధవారంకానీ, గురువారంకానీ ఇది తీవ్ర తుపానుగా మారుతుందని, గురువారం అర్థరాత్రికి లేదంటే శుక్రవారం తెల్లవారుజామున ఒడిసాలోని పూరీ, పశ్చిమబెంగాల్ లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఒకవేళ ఇది తీవ్ర తుపానుగా మారితే దానా అనే పేరు పెట్టడానికి అధికారులు సిద్ధం చేశారు. పశ్చిమబెంగాల్, ఒడిసాతోపాటు ఏపీలోని ఉమ్మడి జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తీసుకుంటున్న చర్యలను తెలిపిన సిసోడియా
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా తెలిపారు. తుపాను హెచ్చరికలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సంబంధిత శాఖలతోపాటు ఒడిసా, పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాలకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను సందర్భంగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆర్పీ సిసోడియా ఈ సమావేశంలో పాల్గొని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి తెలియజేశారు.












Click it and Unblock the Notifications