కలియుగ వైకుంఠాన్ని కాచే క్షేత్రపాలకుడెవరో తెలుసా?- రేపే
Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 78,892 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,930 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.55 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లల్లో వేచివుండట్లేదు. క్యూలైన్ ద్వారా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

రేపు మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలన్నీ కిటకిటలాడుతుంటాయి. కీసరగుట్ట, వేములవాడ, కొమురవెల్లి, కాళేశ్వరం, ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, క్షీరారామం, సోమారామం, అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి, కోటప్ప కొండ, శ్రీముఖం..వంటి ఆలయాలు భక్తుల సందడితో కోలాహలంగా మారుతుంటాయి.
ఈ పండగను పురస్కరించుకుని టీటీడీ అధికారులు బుధవారం తిరుమల క్షేత్రపాలకుడికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలకు పరమేశ్వరుడు క్షేత్రపాలకుడు. రుద్రుడిగా తిరుమలను సంరక్షిస్తోన్నాడు. క్షేత్రపాలకుడిగా పూజలను అందుకుంటోన్నాడు.
తిరుమల గోగర్భం సమీపంలో వెలసిన ఈ క్షేత్రపాలకుడికి మహా శివరాత్రి సందర్భంగా శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించనున్నారు టీటీడీ అర్చకులు, అధికారులు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ రుద్రాభిషేకాన్ని నిర్వహించడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది.
ముందుగా శ్రీవారి ఆలయం నుండి టీటీడీ అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సుగంధ ద్రవ్యాలతో క్షేత్రపాలకుడికి శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం నైవేద్యాన్ని సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications