AP Cabinet: 17 జిల్లాల్లో మార్పులు, సచివాలయాల పేరు మార్పు, గ్రేటర్లకు సై..!
ఏపీలో ఇవాళ సమావేశమైన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో రాష్ట్రంలో జిల్లాల పునర్ విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి కార్పోరేషన్ల ఏర్పాటు, ప్రభుత్వ ఆఫీసుల్లో స్మార్ట్ మీటర్ల బిగింపు, రాష్ట్రంలో రహదారుల విస్తరణలు, భూకేటాయింపులు ఇలా మొత్తం 24 నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. జిల్లాల విభజన విషయంలో మాత్రం కేబినెట్ భేటీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాలకు తోడు కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వీటితో పాటు పలు జిల్లాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఇలా రాష్ట్రంలో 17 జిల్లాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మరో 9 జిల్లాల్లో మాత్రం ఎటువంటి మార్పులూ లేవు. రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లా కాస్తా మదనపల్లె కేంద్రంగా మారబోతోంది. దీంతో రాయచోటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్లోనే కన్నీరు పెట్టుకున్నారు. చంద్రబాబు ఆయన్ను ఓదార్చారు.

అలాగే రాష్ట్రంలో తాజాగా వచ్చిన గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి కార్పోరేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ రెండు కార్పోరేషన్ల ఏర్పాటుకు కేంద్రం చేపట్టబోతున్న జనగణన అడ్డంకిగా మారింది. ఇది పూర్తయిన తర్వాత ఈ రెండు కార్పోరేషన్ల ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయి. అలాగే రైతులకు పాస్ బుక్కుల్ని ఈసారి రాజముద్రతో ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 9లోగా రైతులకు వీటిని అందిస్తారు. దీంతో పాటు రాష్ట్రంలో గ్రామ సచివాలయం పేరును స్వర్ణ గ్రామం గానూ, వార్డు సచివాలయం పేరును స్వర్ణ వార్డుగానూ మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్ల బిగింపుకు ఆమోదం తెలిపారు.

వీటితో పాటు విశాఖలో ఆస్పత్రి నిర్మాణానికి భూకేటాయింపు, పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా మార్పు, మార్కాపురం జిల్లాలోకి గిద్దలూరు, ఎర్రగొండపాలెం చేర్పు, బనగానపల్లె, అడ్డరోడ్డు డివిజన్లుగా ఏర్పాటు, మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా పేరు కొనసాగింపు, బాపట్ల నుంచి అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి మార్పు, అద్దంకి సబ్ డివిజన్ లోనే దర్శి కొనసాగింపు , కడప జిల్లాలోకి రాజంపేట, తిరుపతి జిల్లాలోకి రైల్వేకోడూరు, కడపలోకి సిద్ధవటం, ఒంటిమిట్ట మార్పులు ఉన్నాయి. మడకశిర కొత్త రెవెన్యూ డివిజన్ కానుంది. ఈ మార్పులు జనవరి 1 నుంచే అమల్లోకి రాబోతున్నాయి.












Click it and Unblock the Notifications