స్త్రీవాది, సామాజిక వేత్త మల్లాది సుబ్బమ్మ కన్నుమూత

Malladi Subbamma dead
హైదరాబాద్: ప్రముఖ రచయిత, స్త్రీవాది, సామాజిక వేత్త మల్లాది సుబ్బమ్మ (90) అనారోగ్య కారణాలతో మృతి చెందారు. చివరి అంకం వరకు మహిళల అభ్యున్నతికి పాటుపడిన సుబ్బమ్మ అనారోగ్యంతో గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమెకు నలుగురు సంతానం, అయితే ఇద్దరు కుమారులు కొంతకాలం క్రితం మృతి చెందారు.

సోమాజిగూడలో ఉంటున్న మరో కుమారుడు, రిటైర్డ్ ఇంజినీర్ కెఆర్ మల్లాది చెంతనే సుబ్బమ్మ ఉండేవారు. కుమార్తె డాక్టర్ విజయలక్ష్మి ఇల్లెందులో వైద్య వృత్తిలో కొనసాగుతన్నారు. కాగా, గతంలో ఆమె కోరుకున్నట్లుగా ఆమె మృతదేహాన్ని ఉస్మానియా మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు బంధుమిత్రుల సందర్శనార్థం ఇంటివద్ద ఉంచుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సుబ్బమ్మ స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంక గ్రామం. 1924 ఆగస్టు రెండో తేదీన ఆమె జన్మించారు. చిన్నతనంలోనే ఆమెకు మల్లాది రామ్మూర్తితో వివాహం జరిగింది. సంఘ సంస్కరణ భావాలు కలిగిన రామ్మూర్తి ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సాహంతోనే చదువు కొనసాగించారు. అది ఆమెకు బలమైన వ్యక్తిత్వాన్ని అందిస్తే, అప్పటి అభ్యుదయ, సామ్యావాద సామాజిక వాతావరణం ఆమె దృక్పథాన్ని నిర్దేశించింది. స్త్రీ స్వేచ్ఛ, వికాసం పత్రికలకు ఆమె సంపాదకత్వం వహించారు. పలు సేవా సంస్థలను స్థాపించి.. ఉద్యమంలో తలమునకలు కావడమే కాదు, ఉదారంగా విరాళాలు కూడా ఇచ్చారు.

సుబ్బమ్మ తన ఆస్తులను సెంట్రల్ యూనివర్సిటీ సహా పలు విద్యాసంస్థలకు విరాళంగా అందించారు. కులాంతర, ఆదర్శ వివాహాలను ప్రోత్సహించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సారా ఉద్యమంలో సారించిన విల్లుగా.. సుబ్బమ్మ దూసుకొచ్చిన ఘట్టం మరో ఎత్తు. అప్పట్లో మహిళల బతుకును బుగ్గి చేసి, సామాజిక అశాంతిని రాజేసిన సారా మహమ్మారిపై.. తుదకంటా పోరాడి విజయం సాధించారు. ఆమె చేసిన సేవలకు గాను దుర్గాబాయ్ అవార్డు, తెలుగు వర్సిటీ ఫర్ బుక్ అవార్డు, ప్రియదర్శిని అవార్డు, త్రిపురనేని రామస్వామి అవార్డు, దుర్గాబాయ్ మెమోరియల్ పురస్కారం లభించాయి.

'ఆంధ్రలో మహిళా ఉద్యమాలు' అనే పుస్తకానికిగానూ అనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతులు మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. 2003లో ఆమెకు అప్పటి చంద్రబాబు నాయుడు 'మహిళా ఆత్మగౌరవ పురస్కారా'న్ని ప్రదానం చేశారు. చీకటి వెలుగులు, ఈ దేశం నాదేనా, క్రాంతికిరణాలు తదితర 88 పుస్తకాలు ఆమె రచించారు. కాగా, సుబ్బమ్మ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సుబ్బమ్మ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి వెలిబుచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+