గాయనిని చేస్తానని కిడ్నాప్: కేరళకు తరలింపు

ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన ఇక్కడ మీడియాకు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని పప్పల్ ప్రాంతానికి చెందిన ముస్తఫా అలియాస్ యూసుఫ్ రెండేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలసవచ్చాడని తెలిపారు. రెండేళ్ల నుంచి ఫిరోజ్ గాంధీనగర్‌లోని ఓ ఇంట్లో యూసుఫ్ అద్దెకు ఉంటున్నాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకున్న ముస్తఫా తన యజమాని కుమార్తె (14)పై కన్నేశాడు. సంగీతంపై ఆమెకున్న ఆసక్తిని గమనించి ఆమెతో మాట కలిపాడు.
తనకు కేరళ సినీ రంగానికి చెందిన అనేక మందితో పరిచయాలున్నాయని బాలికను నమ్మించాడు. తనతో వస్తే గాయనిని చేస్తానని, సినీ రంగంలో బ్యూటీషియన్ గానూ పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు కల్పిస్తానని వలవేశాడు. దీంతో యూసుఫ్ మాటలు నమ్మిన బాలిక, కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా డిసెంబర్ 11న అతనితోపాటు కేరళ వెళ్లిపోయింది. కేరళలోని అలెప్పి(అలప్పుజ)లో ఉన్న తన స్నేహితుడు, ఆటో డ్రైవర్ పిఏ హషీమ్ ఇంట్లో బాలికను ఉంచాడు.
ఆ తర్వాత బాలికను దుబాయ్‌కి అక్రమ రవాణా చేయాలని ఉద్దేశంతో బాలికకు పాస్‌పోర్ట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అందుకు అవసరమైన నకిలీ పత్రాలను బాలిక పేరుతో సృష్టించాడు. అంతేగాక అలెప్పిలోనే నకిలీ ఓటర్ గుర్తింపు కార్డును కూడా తయారు చేయించాడు. ఇది ఇలా ఉండగా బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తును మొదలు పెట్టారు.
నిందితుడు అలెప్పిలో ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ్నుంచి వెళ్లిన ప్రత్యేక పోలీసుల బృందం యూసుఫ్‌ను అరెస్ట్ చేసి, బాలికను కాపాడారు. గురువారం నగరానికి తీసుకువచ్చిన బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా నిందితుడిపై పలు ఆర్థిక మోసాలకు పాల్పడిన ఆరోపణలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. యూసుఫ్‌పై పలువురు ఈ విషయంపై ఫిర్యాదు చేశారని చెప్పారు. నిందితుని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పోలీసుల సహాయం తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications