అక్రమ సంబంధమనే అనుమానం: భార్యనూ కూతుర్నీ చంపేసిన వ్యక్తి
గుంటూరు: ఓ వ్యక్తి విషయంలో అనుమానమే పెను భూతమైంది. భార్య వైవాహికేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో అతను భార్యనే కాకుండా కూతురిని కూడా కిరాతకంగా హత్య చేశాడు .ఈ సంఘటన గుంటూరు జిల్లా నగరం మండలం చిరకాల గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
వెంకటకృష్ణ అనే వ్యక్తి భార్య ఉప్పాల తిరుపతమ్మ (24)ను, నాలుగేళ్ల కూతురు నాగశ్రీని కత్తితో నరికి చంపాడు. తిరుపతమ్మ శవం ఇంట్లో పడి ఉండగా, నాగశ్రీ మృతదేహం ఇంటికి కొద్ది దూరంలో పడి ఉంది. పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. భార్యపై అనుమానంతోనే అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

భార్యను హత్య చేసిన తర్వాత ఇద్దరు పిల్లలను బయటకు తీసుకుని వెళ్లాడు. కూతురుని హత్య చేసి శవాన్ని ఇంటి వెనక పాతిపెట్టాడు. కుమారుడి ఆచూకీ తెలియడం లేదు. కుమారుడు యశ్వంత్‌ను తనతో పాటు తీసుకుని వెళ్లాడా, అతన్ని కూడా హత్య చేశాడా అనేది తెలియడం లేదు. యశ్వంత్ ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. వెంకటకృష్ణ పరారీలో ఉన్నాడు. అతని కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి.
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు
గుంటూరు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్ గ్రామంలోని ఎపి గురుకుల కళాశాల సమీపంలో ఉన్న ఓ మైదానంలో శుక్రవారం ఉదయం తోటి మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఓ విద్యార్థికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆ విద్యార్థిని సమీపంలోని కమలా నెహ్రూ ఆస్పత్రిలో చేర్పించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. చనిపోయిన విద్యార్థి పి. వెంకటేష్ (20) ఆంధ్రప్రదేశ్ గురుకుల కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతని స్వస్థలం శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం చెన్నాపురం గ్రామం.












Click it and Unblock the Notifications