అప్పట్లో మేమిద్దరం అలా ఉండేవాళ్లం.. ఆ రోజులే వేరు
PM Modi and Chandrababu Naidu: ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ.. తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్కు పునః శ్రీకారం చుట్టారు. రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనేక అంశాలను ప్రస్తావించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ, చేతివృత్తుల కళాకారుల గురించి ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ఆయన అరకు కాఫీ గురించి మన్ కీ బాత్‌లో మాట్లాడారు. గత రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. అరకు కాఫీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. లోకల్ టు గ్లోబల్‌పై మాట్లాడుతున్న సమయంలో అరకు కాఫీని ప్రస్తావనకు తీసుకొచ్చారు ప్రధాని మోదీ. అరకులో మాత్రమే లభించే అద్భుత రుచి గల కాఫీ.. ఇప్పుడు విశ్వవ్యాప్తమైందని పేర్కొన్నారు.

అరకు కాఫీ రుచి చూడాలంటూ కాఫీ ప్రియులందరినీ కోరుకుంటోన్నట్లు చెప్పారు మోదీ. అరకులో తయారయ్యే కాఫీకి మాత్రమే ఓ ప్రత్యేకమైన అరోమా ఉందని, అలాంటిది మరెక్కడా లభించదని మోదీ వివరించారు. ఇక్కడి కాఫీ గింజల సాగు, తయారీ, ఇతర కార్యకలాపాల ద్వారా లక్షన్నరమంది కొండదొర ఆదివాసీలు, గిరిజనులకు ఉపాధి దొరుకుతోందని అన్నారు.
గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా అరకు కాఫీకి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించామని మోదీ పేర్కొన్నారు. 2016లో విశాఖపట్నం వెళ్లినప్పుడు గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శించానని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి అరకు కాఫీని టేస్ట్ చేశానని గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన రెండు ఫొటోలను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
అరకు కాఫీకి ఎన్నో అంతర్జాతీయ అవార్డుల లభించాయని మోదీ చెప్పారు. గత ఏడాది దేశ రాజధానిలో నిర్వహించిన జీ20 సమ్మిట్‌లోనూ ఈ బ్రాండ్ హవా నడిచిందని, ఈ సదస్సుకు వచ్చిన వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు అరకు కాఫీని సర్వ్ చేశామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications