'గందరగోళంతో జగన్‌కి నిద్రపట్టడం లేదు, టీడీపీలోకి రెడీ'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో గందరగోళ పరిస్థితి ఉండటంతో, ఏం చేయాలో తెలియక జగన్‌కు నిద్రపట్టడం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం పిఠాపురంలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రతిపక్షం బలహీనంగా ఉందని, ఒక రకంగా చెప్పాలంటే జగన్‌కు ఏం చేయాలో తెలియడం లేదన్నారు. త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉన్నత శ్రేణి నాయకులు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలున్నాయన్నారు.
జగన్ అక్రమాల ఉచ్చులో చిక్కుకున్నారని, ప్రభుత్వం జగన్ ఊసే మరిచిపోయిందన్నారు. ఇప్పటికే రూ.1100 కోట్ల అటాచ్‌మెంట్, పది ఛార్జీషీట్లతో అవినీతి జగన్‌ను వెంటాడుతోందన్నారు. జగన్ వెంట ఉండి తిప్పలు పడేకంటే.. చంద్రబాబు వెంట ఉండటం మంచిదన్న ధోరణిలో ఆ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారన్నారు.

గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైనా యనమల మండిపడ్డారు. గవర్నర్‌కు అధికారాలపై ఆయన వ్యాఖ్యలు సరికావన్నారు. విభజన బిల్లు రూపొందించేటప్పుడు లేని అభ్యంతరం కేసీఆర్‌కు ఇప్పుడెందుకని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయన్నారు.
జగన్ రాక్షసుడు: చంద్రదండు
కష్టాల్లో ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తే చంద్రబాబు రైతుల పక్షపాతి అవుతాడనే భయంతోనే జగన్ ఆర్బీఐని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ నాయుడు ఆరోపించారు. అనంతపురంలో డ్వాక్రా మహిళలు, రైతులు, చంద్రదండు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ రైతుల పొట్ట కొట్టే రాక్షసుడన్నారు. జగన్ లాంటి వారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రుణమాఫీకి బాబు కట్టుబడి ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications