వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్కే ఎక్కడ?: జల్లెడ పడుతున్న మావోలు, వెలసిన పోస్టర్లు

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రా-ఒరిస్సా అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగి దాదాపు వారం రోజులు అయ్యింది. అనాటి నుంచి మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దీంతో మావోయిస్టు పార్టీలో ఆందోళనకర వాతావరణం నెలకొంది.

ఈ ఎన్‌కౌంటర్‌లో 30మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‍కౌంటర్‌‌ను నిరసిస్తూ మావోయిస్టులు నవంబర్ 3న ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే, ఎన్‌కౌంటర్ తర్వాత నుంచి మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీ తెలియకపోవడం పట్ల ఇటు ప్రజా సంఘాలు, అటు మావోయిస్టుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది.

కాగా, మావోయిస్టు అగ్రనేత ఆర్కేను ఎన్ కౌంటర్ జరిగిన సమయంలోనే పోలీసులు బంధించారని పలువురు ప్రజాసంఘాల నేతలు ఇప్పటికే ఆరోపణలు చేశారు. ఆర్కే భార్య శిరీష కూడా తన భర్తను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలంటూ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పోలీసుల అదుపులో ఆర్కే ఉన్నట్లయితే.. ఆయనకు ఎలాంటి హాని తలపెట్టొద్దని కోర్టు ఆదేశించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఏపీ డీజీపీ, ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అయితే, తాము ఆర్కేను బంధించలేదని, ఆయన ఆచూకీ కూడా మాకు తెలియదని ఏపీ పోలీసు శాఖ చెబుతోంది. ఆర్కే తమ వద్ద ఉంటే దాచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది.

అగ్రనేత కోసం జల్లెడపడుతున్న మావోలు

వారం రోజులుగా అగ్రనేత ఆర్కే ఆచూకీ లేకపోవడంతో మావోయిస్టులు ఏవోబీ తోపాటు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. అంతేగాక, పలు ప్రాంతాల్లో బంద్‌కు సహకరించాలంటూ పోస్టర్లు అంటించడంతోపాటు మావో అగ్రనేత సమాచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు జల్లెడ పడుతున్నారు.

Maoists search for RK

బంద్ నేపథ్యంలో అప్రమత్తం

మావోయిస్టులు నవంబర్ 3న ఐదు రాష్ట్రాల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రా, ఒడిశా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీలోని ప్రభావిత ప్రాంతాల ప్రజాప్రతినిధులు సమాచారం ఇవ్వకుండా ఎటూ వెళ్లకూడదని పోలీసు శాఖ సూచించింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు భద్రతను పెంచింది. ఏవోబీ, అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేపడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు.. విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

12మంది అదృశ్యం వెనక ఎవరున్నారు?

ఏవోబీలో ఎదురుకాల్పులు సమయంలో మావోయిస్టు అగ్రనేతలతోపాటు 12మంది గిరిజనులు అదృశ్యమయ్యారనే వార్త కలకలం రేపుతోంది. వీరి అదృశ్యం వెనక ఎవరున్నారనేది ఉత్కంఠగా మారింది. ఆర్కే కొడుకు వద్ద లభించిన ల్యాప్‌టాప్‌లో మావోలకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్లు తెలిసింది. అలాగే ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో లభించిన పేపర్లలో పలువురి పేర్లు ఉన్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా, పోలీసుల అదుపులో ఉన్న ఆర్కేను వెంటనే కోర్టులో హాజరుపర్చాలంటూ విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. ఏవోబీలో కూంబింగ్ కూడా తక్షణమే నిలిపివేయాలని అన్నారు. ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని కోరారు. హన్మకొండలో బుధవారం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీపీఎస్‌ విధానంతో కోవర్టును పంపించి మావోయిస్టులపై విరుచుకు పడ్డారని ఆయన ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

కాగా, ఏది ఎలా ఉన్నా.. ఏవోబీ ఎన్‌కౌంటర్ జరిగి వారం రోజులు గడుస్తున్నా.. మావో అగ్రనేత ఆర్కే ఆచూకీ లభ్యం కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ఆర్కే ఏమయ్యారనేదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

English summary
It is said that Maoists are searching for to leader Ramakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X