''నేను తెలుగు వాడిని.. తెలుగుదేశం వాడిని!''
ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుజాతికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అన్న నందమూరి తారకరామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలుగుజాతి ఆత్మగౌరవ పతాకంగా, రాజకీయ చైతన్యానికి సంకేతంగా టీడీపీ ఆవిర్భవించి 41 సంవత్సరాలు పూర్తయిందని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. అన్న ఎన్టీఆర్ ఆశయాల మేరకు అణగారిన వర్గాలకు పసుపు జెండా అండగా నిలిచిందని, బడుగు బలహీనవర్గాలకు టీడీపీ భరోసాగా నిలిచిందన్నారు. మహిళల స్వావలంబనకు చేయూత అందించింది కూడా తెలుగుదేశం పార్టీయేనని సకల రంగాల అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ సంతకం చెరగనిదని చెప్పారు.

దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా ఒక్క తెలుగుదేశం పార్టీకే లక్షలాది కార్యకర్తల సైన్యం ఉందని కొనియాడారు. ''నేను తెలుగువాడినని సంతోషిస్తాను.. తెలుగుదేశం వాడినని గర్విస్తాను'' అని లోకేశ్ తన ట్వీట్‌లో తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును ఈసారి రాజమండ్రిలో జరపాలని నిర్ణయించుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ప్రతి ఏడాది మహానాడుగా టీడీపీ నిర్వహిస్తూ వస్తుంటుంది. తాజాగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబునాయుడు పొలిట్ బ్యూరో సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 30వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల పేరుతో 100 సమావేశాలు నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు అండమాన్ తోపాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న విదేశాల్లో కూడా జరపాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications