రామోజీరావుకు బిగ్ షాక్- డీమార్ట్, ఎయిర్‌టెల్‌కు మార్గదర్శి నిధులు మళ్లింపు
అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన కేసు- కీలక మలుపు తిరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై విస్తృత దాడులను నిర్వహించిన అనంతరం కేసు పెట్టిన సీఐడీ అధికారులు ఇదివరకు ఆస్తులను అటాచ్ చేశారు. దీని విలువ 793,50,72,460 కోట్ల రూపాయలు. తాజాగా మరో 242 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేశారు.
ఛిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది మార్గదర్శి చిట్స్ సంస్థ యాజమాన్యం. అవి నిజమని తేలడంతో సీఐడీ అధికారులు ఇదివరకే కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఛిట్ ఫండ్స్ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు. తాజాగా రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేశారు.

మార్గదర్శి ఛిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ల నివాసాలపై ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు సోదాలను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు విస్తృతంగా కొనసాగాయి. మార్గదర్శి కార్యాలయాల్లో రోజంతా తనిఖీలను కొనసాగించారు. పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీ రావును కూడా వారు విచారించారు. ఫిల్మ్‌సిటీలోని రామోజీ రావు నివాసంలో ఈ విచారణ కొనసాగింది.
ఈ పరిణామాల మధ్య- ఇవ్వాళ ఏపీ సీఐడీ అధికారులు రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆస్తులను అటాచ్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే వెల్లడించింది. ఈ మేరకు జీఓ నంబర్ 116ను జారీ చేసింది. ఈ జీఓను హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు.
నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శిలో డబ్బులను డిపాజిట్ చేసిన చందాదారుల నిధుల మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు. 40 సంస్థలకు వాటిని మళ్లించినట్లు గుర్తించారు. ఈ 40 సంస్థల పేర్లను ఈ జీఓలో పొందుపరిచారు. డీమార్ట్‌ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్ మార్కెట్స్, భారతి ఎయిర్‌టెల్, సెంచరీ టెక్స్‌టైల్స్ వంటి సంస్థలకు నిధులను మళ్లించినట్లు గుర్తించారు.
హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, నేషనల్ హైవే అథారిటీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్, నిప్పాన్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, టాటా కేపిటల్ ఫైనాన్స్ సర్వీసెస్, టాటా కెమికల్స్ లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వ్యాన్‌టెల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వంటి సంస్థల పేర్లు ఇందులో ఉన్నాయి.
వాటితో పాటు- ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఆదిత్య బిర్లా కేపిటల్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్‌లకు మార్గదర్శి డిపాజిట్లను మళ్లించినట్లు హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని 242 కోట్ల రూపాయలను అటాచ్ చేసినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications