శ్రీలక్ష్మి సంచనలం..జగన్ ఆదేశాల మేరకు తాడేపల్లిలో..!!
గుంటూరు: ఏరికోరి ఏపీకి వచ్చిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి.. తనదైన శైలిలో పరిపాలనపై తనదైన ముద్ర వేస్తోన్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ అవుతారనే ప్రచారం నేపథ్యంలో ఆమె తనకు అప్పగించిన మున్సిపల్ పరిపాలన శాఖలో సమర్థవంతమైన పనితీరును ప్రదర్శిస్తోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అదే పనిగా ఆమె ఏపీకి వచ్చారు. తెలంగాణ నుంచి తన క్యాడర్‌ను ఏపీకి మార్చుకున్నారు.
వైఎస్ జగన్ ఆదేశాల మేరకుక ఆమె ఇవ్వాళ తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడి రికార్డులను పరిశీలించారు. ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కావట్లేదంటూ ఫిర్యాదు అందిన నేపథ్యంలో- శ్రీలక్ష్మి ఈ తనిఖీలను చేపట్టారు. అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. నాలుగో తరగతి సిబ్బందినీ నవ్వుతూ ఆప్యాయంగా పలకరించారు. విధి నిర్వహణలో వారు ఏవైనా ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కొంటోన్నారా? అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

శ్రీలక్ష్మి తనిఖీకి వస్తుందనే విషయం ముందుగా తెలియకపోవడంతో కొందరు ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయం నుంచి బయటికి వెళ్లినట్లు గుర్తించారు. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసిన సిబ్బంది ఆ తరువాత కార్యాలయంలో లేరనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. వారి వివరాలను తనకు అందజేయాలని ఆదేశించారు.
మున్సిపల్ శాఖకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు సమగ్రమైన సేవలను అందించడంలో అత్యంత కీలకమైన ఈ శాఖలో పని చేసే ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించకూడదని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో తలెత్తిన సమస్యల గురించీ శ్రీలక్ష్మి ఆరా తీశారు. చలికాలంలో సీజనల్ వ్యాధులు ముసురుకునే ప్రమాదం ఉందని, శానిటరీ విభాగం సిబ్బంది ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

సీజనల్, అంటువ్యాధులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. వివిధ శాఖలు, విభాగాలకు చెందిన ఉద్యోగులు సకలంలో విధులకు హాజరు కావట్లేదంటూ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో- దీన్ని పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అన్ని విభాగాధిపతుల కార్యాలయాలకూ సర్కులర్‌ను జారీ చేశారు. ఆకస్మిక తనిఖీలను నిర్వహించాలని సూచించారు.












Click it and Unblock the Notifications