'ఇక్కడ ఆయన లేరుకదా!'... తెరపైకి ''గరికపాటి vs చిరంజీవి''
ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావుకు మెగాస్టార్ చిరంజీవి గట్టి కౌంటర్ ఇచ్చారు. 'ఇక్కడ ఆయన లేరుకదా' అని సున్నితంగా అంటూనే సెటైర్ వేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి 'అలయ్ బలయ్' నిర్వహించిన సంగతి తెలిసిందే. విజయ దశమి తర్వాతరోజు హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవితోపాటు గరికపాటి కూడా పాల్గొన్నారు.

చిరంజీవిని ఫొటో సెషన్ ఆపాలని కోరిన గరికపాటి
వేదికపైకి వచ్చిన మహిళలు చిరంజీవితో ఫొటోలు తీసుకుంటుండగా నిర్వాహకులు మాట్లాడాలంటూ గరికపాటికి మైక్ ఇచ్చారు. వేదికపై ఒకవైపు చిరంజీవి ఫొటో సెషన్ జరుగుతుండగా మరోవైపు గరికపాటి ప్రవచనానికి సిద్ధమయ్యారు. అందరి దృష్టి అటువైపే ఉండటంతో 'చిరంజీవిగారు ఫొటో సెషన్ ఆపితే నేను మాట్లాడతా' అన్నారు. ఒకటికి మూడుసార్లు గరికపాటి ఇవే వ్యాఖ్యలు చేశారు. వెంటనే చిరంజీవి తన ఫొటో సెషన్ ముగించుకొని గరికపాటి పక్కనే కూర్చున్నారు.

నాగబాబు జోక్యంతో పెరిగిన వివాదం
తర్వాత దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. నాగబాబు జోక్యం చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అఖిల భారత బ్రాహ్మణ సమితి జోక్యం చేసుకొని నాగబాబుకు కౌంటర్ ఇచ్చింది. తర్వాత వివాదం రోజురోజుకు పెద్దదైంది. గాడ్ ఫాదర్ ఈవెంట్‌లో దర్శకుడు బాబీ, కెమెరామెన్ చోటా కే నాయుడు లాంటి వారు గరికపాటి పేరు ఎత్తకుండా పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. .
పుస్తకావిష్కరణలో పాల్గొన్న చిరంజీవి
గరికపాటి వివాదంపై ఇన్నాళ్లకు చిరంజీవి స్పందించారు. సినీ జర్నలిస్టు ప్రభు శూన్యం నుంచి శిఖరాగ్రాలకు అనే పుస్తకాన్ని రాశారు. చిరంజీవిపై రాసిన ఈ పుస్తకావిష్కరణకు చిరంజీవే అతిథిగా రావడం విశేషం. ఈ కార్యక్రమంలో వేదికపైకి వచ్చిన మహిళలతో చిరంజీవి మరోసారి ఫొటో సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 'ఇక్కడ ఆయన లేరుకదా' అనడంతోపాటు అందరికీ అర్థం కావడానికి చేతితో సైగ చేసి చూపించారు. దీంతో అక్కడి సభ మొత్తం నవ్వులతో హోరెత్తింది.












Click it and Unblock the Notifications