తొలి వైఫై నగరంగా హైదరాబాద్: కేటీఆర్, కేసీఆర్ హామీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదును తొలి వైఫై నగరంగా చేయాలనుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, కేటీఆర్‌లతో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు మంగళవారం భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా హైదరాబాదు నగరంలో మైక్రోసాఫ్ట్‌ను మరింత విస్తరించేందుకు ఆ సంస్థ భారత చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఐటీ విధాన ఖరారులో సహకరించేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. ఈ భేటీలో కేసీఆర్, భాస్కర్ ప్రామాణిక్‌లతో పాటు ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. హైదరాబాదులో మైక్రోసాఫ్టు కంపెనీ విస్తరణకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాదులో ఇబ్బందులున్నాయా అని కేసీఆర్ అడగగా, లేవని ప్రామాణిక్ చెప్పారని సమాచారం. తమ ప్రభుత్వం త్వరలో ఐటీ విధానం రూపొందిస్తుందని, దీని రూపకల్పనలో సాయం చేయాలని కేసీఆర్ కోరగా.. ఆయన హామీ ఇచ్చారని తెలుస్తోంది.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పరిశ్రమ ప్రోత్సాహానికి తీసుకుంటున్న చర్యలను కేసీఆర్ వివరించారు. మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా నియమితులైన తర్వాత తొలిసారి హైదరాబాదుకు సత్య నాదెళ్ల వచ్చే సందర్భంగా ఆయనకు తెలంగాణ ప్రభుత్వ పౌర సన్మానం చేయాలనుకుంటుందని తెలిపారు. తెలుగువాడు మైక్రోసాఫ్ట్ చైర్మన్ స్థాయికి ఎదగడం గర్వకారణమని, ఆయనకు హైదరాబాదులో పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఆగస్టు లేదా సెప్టెంబరులో సత్య నాదెళ్ల వచ్చే అవకాశముందని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఐటీ మంత్రి కేటీఆర్‌తో చెప్పారు. హైదరాబాదును తొలి వైఫై నగరంగా మార్చాలనుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. అలాగే తెలంగాణలోని ప్రతి గ్రామంలో నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ ద్వారా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించాలనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, ఆగస్టు ఆరో తేదిన వీరు మరోసారి భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications