చంద్రబాబు కేసులో అలా - నేడు వెంకటరెడ్డికి ఇలా, బెయిల్ వెనుక..!!
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డి విడుదలయ్యారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో గనుల శాఖలో జరిగిన అక్రమాల వెనుక వెంకట రెడ్డి కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిగా గురి పెట్టింది వెంకట రెడ్డి పైనే. ఇసుక కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన 50 రోజుల్లోనే ఆయన జైలు నుంచి బయటకు రావటం ఇప్పుడు కూటమి నేతల్లో చర్చకు కారణమైంది. భారీ స్థాయిలో అభియోగాలు ఉన్నా.. బెయిల్ విషయంలో అభ్యంతరం చెప్పకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.
వెంకటరెడ్డి విడుదల వెనుక
ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి అనూహ్యంగా బెయిల్ దక్కింది. ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. కండీషన్లతో ఆయనకు బెయిల్ లభించింది. మైనింగ్ శాఖలో నిబంధనలకు విరుద్దంగా ఇసుక అంశంలో భారీగా అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలతో ఏసీబీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 26న వెంకటరెడ్డి హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు. విచారణ సమయంలో వెంకటరెడ్డి సహకరించలేదనే వార్తలు వచ్చాయి. అయినా 50 రోజుల్లోనే ఆయనకు బెయిల్ రావటం.. బయటకు వచ్చేయటం పైన ఇప్పుడు కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. తీవ్ర ఆరోపణలు ఉన్న వ్యక్తికి బెయిల్ విషయంలో న్యాయస్థానంలో అభ్యంతరం చెప్పటం.. వాదనలు వినిపించటంలో ఏం జరిగిందనేది కూటమి నేతలు ఆరా తీస్తున్నారు.

బెయిల్ - విడుదల
వెంకటరెడ్డి ఆరోగ్య పరమైన కారణాలతో తనకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఎవరి ప్రమేయం లేకుండా రూ 160 కోట్లను మళ్లించినట్లు విచారణ అధికారులు నిర్దారించారు. వెంకటరెడ్డి చేసిన అవినీతి పైన విచారణ అధికారులు ఆధారాలు సేకరించారు. అయితే, బెయిల్ విచారణ సమయంలో వీటిని న్యాయస్థానం లో ముందుంచి బెయిల్ రాకుండా వాదనలు వినిపించటంలో విఫలమయ్యారా అనే సందేహం కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు. వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలైనప్పటి నుంచి బలంగా కౌంటర్లు దాఖలు చేయలేక పోయారనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది.
చంద్రబాబు కేసులో
విచారణ సమయంలో ఆధారాలు సేకరించినా... కోర్టుకు సరైన సమయంలో వాటిని సమర్పించ లేక పోయారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వెంకటరెడ్డికి బెయిల్ మంజూరు విషయం కూడా గోప్యంగానే ఉంచారు. శుక్రవారమే ఆయనకు కోర్టు పలు కండీషన్లతో బెయిల్ మంజూరు చేసింది.వెంకటరెడ్డి కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదనే షరుతతో పాటుగా రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు నిర్దేశించింది. నాడు చంద్రబాబు పై ఏసీబీ నమోదు చేసిన కేసులో 53 రోజులు జైలులో ఉన్నారు. చంద్రబాబు కేసులో నాటి ఏసీబీ అధికారులు వ్యవహ రించిన తీరు టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. కానీ, వెంకటరెడ్డి విషయంలో మాత్రం నేటి ఏసీబీ వ్యవహరించిన తీరు పైన ప్రస్తుతం కూటమి నేతల్లో ఆసక్తి కరంగా చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications