మేం దాడి చెయ్యలేదు; కాణిపాకంలో ప్రమాణానికి వస్తారా: మంత్రి ఆదిమూలపు సురేష్
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఎర్రగొండపాలెంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక దీనిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తనదైన శైలిలో ఫైర్ అయ్యారు.
చంద్రబాబు సభకు జనం రాకపోవడంతోనే గొడవలు సృష్టించారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్ క్షమాపణ చెప్పాలని తాము శాంతియుతంగా నిరసన తెలియజేశామని పేర్కొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ తాము దాడి చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, టిడిపి నేతలు వస్తే కాణిపాకం ఆలయానికి వెళ్లి ప్రమాణం చేద్దాం అన్నారు.

ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సిపి కంచుకోట అని, దమ్ముంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని సవాల్ విసిరారు. ఎర్రగొండపాలెంలో టీడీపీ గెలిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని ఆదిమూలపు సురేష్ చాలెంజ్ చేశారు. దళితులపై రాళ్లదాడి పాపం చంద్రబాబుదే అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు దగ్గరుండి తమ కార్యకర్తల పైన దాడులు చేయించారని ఆదిమూలపు సురేష్ నిప్పులు చెరిగారు. తనను తగలబెట్టినా భయపడనన్నారు.
తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉంటే నిరసన తెలియజేస్తున్న ప్రాంతానికి చేరుకున్న సమయంలో దళిత నేతలను చంద్రబాబు వేలు చూపించి బెదిరించారని, అల్లరి మూకలను ఉసిగొల్పి, రెచ్చగొట్టి మారణహోమం సృష్టించాలని చూశారని ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. దళితుల పట్ల చంద్రబాబులో ఎటువంటి మార్పు లేదని, తాను రచించుకున్న ప్రీ ప్లాన్డ్ స్క్రిప్టులో భాగంగానే అల్లరి మూకలను తీసుకువచ్చారని అసహనం వ్యక్తం చేశారు.

రాళ్లు, జెండాలు, ఇనుపరాడ్లతో దాడి చేస్తే వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఎర్రగొండపాలెంలో అసైన్డ్ భూముల అక్రమాలు, గంజాయి ఉందంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. ఎన్ఎస్జీ కమాండెంట్ కు తగిలిన గాయాలు టిడిపి కార్యకర్తల వల్లేనని పేర్కొన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పే వరకు ఈ నిరసనలు ఆగవని, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఎస్పీ నియోజకవర్గానికి వెళ్ళినా నిరసన తెలియజేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications