టీడీపీకి అందని జగన్ కొత్త స్ట్రాటజీ..!!
YS Jagan: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను మార్చడం, కొత్తవారికి బాధ్యతలను అప్పగించడం.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్, కొండెపి- ఆదిమూలపు సురేష్, వేమూరు- వరికూటి అశోక్ బాబు, తాడికొండ- మేకతోటి సుచరిత, సంతనూతలపాడు- మేరుగ నాగార్జున, చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు, గుంటూరు పశ్చిమ- విడదల రజినీ, అద్దంకి- పాణెం హనిమిరెడ్డి, మంగళగిరి- గంజి చిరంజీవి, రేపల్లె- ఈవూరు గణేష్, గాజువాక- వరికూటి రామచంద్రరావు అపాయింట్ అయ్యారు.

యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఆదిమూలపు సురేష్‌ను కొండెపికి పంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగురుతోంది. డోలా బాలవీరాంజనేయస్వామి సొంత స్థానం ఇది. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి విజయం సాధించార. ఈ సారి కూడా ఆయనకే టికెట్ దక్కొచ్చు.
యర్రగొండపాలెం నుంచి కొండెపికి మార్చడంపై ఆదిమూలపు సురేష్ స్పందించారు. నియోజకవర్గ మార్పుపై పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, వారి ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటానని, ఓ సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ టీం కెప్టెన్ అని కితాబిచ్చారు.

మ్యాచ్ గెలవాలంటే కేప్టెన్ నిర్ణయాలను పాటించక తప్పదని, జట్టు కూర్పు, ఫీల్డ్ సెట్టింగ్ ప్రకారం నడుచుకుంటామని ఆదిమూలపు సురేష్ అన్నారు. కొండెపిలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. పార్టీ స్ట్రాటజీ ప్రకారం కొండేపి నియోజకవర్గంలో గెలవాలన్న ధృడ సంకల్పంతో ముందుకు వెళ్తామని అన్నారు.
గతంలో పనిచేసిన ఇన్‌ఛార్జీలను కలుపుకుని, వారి సహాయ సహకారాలతో తీసుకుంటానని ఆదిమూలపు అన్నారు. వైఎస్ జగన్ చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్తామని, వచ్చే ఎన్నికల్లో కొండెపిలో వైసీపీ గెలుపు బావుటా ఎగుర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ కొత్త స్ట్రాటజీతో టీడీపీ ఉక్కిరిబిక్కిరికి గురి అవుతోందని అన్నారు.












Click it and Unblock the Notifications