టీడీపీ మోత మోగిద్దాం పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు!!
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. దేశ విదేశాలలోని అభిమానులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారు. ఇక చంద్రబాబుపై కేసుల నేపధ్యంలో వినూత్న నిరసన తెలిపేందుకు రెడీ అయిన టీడీపీ మోత మొగిద్దాం రండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30 2023 రాత్రి 7గంటల నుండి 7గంటల 5నిమిషాల వరకు ఐదు నిమిషాల పాటు ఐదు కోట్ల ఆంధ్రులు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడ ఉన్నా బయటకు వచ్చి గంట కొట్టండి లేదా ప్లేట్ మీద గరిటతో కొట్టండి అంటూ పిలుపునిచ్చింది టీడీపీ.

రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టాలని, విజిల్ ఉంటే విజిల్ వెయ్యాలని.. ఏదో ఒకరకంగా 7గంటల నుండి 7గంటల 5 నిమిషాల వరకు చంద్రబాబు కోసం మోత మోగించండి అంటూ తెలుగుదేశం పార్టీ పేర్కొంది. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని, ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా మోత మోగించాలని పిలుపునిచ్చింది.
ఇక దీనిపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసిన అంబటి రాంబాబు గతంలో జరిగిన కాపు ఉద్యమాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు పళ్ళాలు కొట్టమంటున్నావు అంటూ టీడీపీని టార్గెట్ చేశారు. విధి విచిత్రమైనది అని పేర్కొన్న అంబటి రాంబాబు కాపు ఉద్యమంలో పళ్ళాలు కొట్టినవారిని మక్కెలిరగొట్టి బొక్కలో వేసావ్ అంటూ గుర్తుచేశారు.
గతంలో టీడీపీ పాలనా సమయంలో జరిగిన కాపు ఉద్యమాన్ని ప్రస్తావించారు. కానీ విధి విచిత్రం ఏమిటంటే అప్పుడు పళ్ళాలు కొట్టినవారిని మక్కెలిరగొట్టి జైల్లో వేసి, ఇప్పుడు అవినీతి కేసులో బొక్కలో పడి పళ్ళాలు కొట్టమంటున్నావ్ ! వారే వాహ్ ! అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు.అంతకు ముందు మరో పోస్ట్ లో భయాన్ని పరిచయం చేస్తానన్న యువగళం భయంతోనే మూగబోయింది అంటూ నారా లోకేష్ యువ గళం పాదయాత్రను టార్గెట్ చేశారు. అంతకు ముందు సుయ్.. లేదు, సై...లేదు షూటింగ్ లో ఉన్నారా ? పునరాలోచనలో ఉన్నారా ? అంటూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications