టమోటా కిలో రూపాయి, అసలు కారణం- ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
ఏపీలో టమోటా ధరలు ఘోరంగా పతనం అయ్యాయి. రైతులు ఆందోళన చెందుతున్నారు. కిలో టమోటా రూపాయికి అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో, రైతులు పంట జాతీయ రహదారి పైన పోసి నిరసన వ్యక్తం చేసారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో.. ప్రభుత్వం స్పందించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టమోటా ధరల పైన అధికారులతో సమీక్ష చేసారు. టమోటా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుత మార్కెట్ లో పరిస్థితుల గురించి వివరించారు.
కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో టమోటా ధర భారీగా పతనమైంది. కిలో టమోటాను రూపాయి చొప్పున మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. కిలో టమోటాలను రూపాయికి కొనుగోలు చేస్తే ఎలా వ్యవసాయం చేయాలని వాపోయారు. కనీసం రవాణా ఖర్చులకు కూడా సరిపోవడం లేదన్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని, టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

బహిరంగ మార్కెట్లో కిలో టమోటాను వ్యాపారులు రూ.30కు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, ఈ వ్యవహారం పైన ప్రభుత్వం స్పందించింది. మంత్రి అచ్చెన్నాయుడు టమోటా రైతులకు హామీ ఇచ్చారు. అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
టమోటా ధరల పతనం పైన మంత్రి సమీక్షించారు. రాప్తాడు మార్కెట్ లో ఆదివారం టమోటా ధరలు: గరిష్టం రూ.18, కనిష్ఠం రూ.9, మోడల్ ధర రూ.12 గా ఉన్నట్లు వివరించారు. కాగా, 30 నుండి 40 మెట్రిక్ టన్నులు మించి పత్తికొండ మార్కెట్ సరుకు రాదని, దసరా సెలవులు కావడంతో మరొక 10 టన్నులు అదనంగా చేరుకుందని చెప్పారు.
రోడ్లపై 2వ గ్రేడ్ క్వాలిటీ టమాటాలు వేసి గందరగోళం సృష్టించారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 10 మెట్రిక్ టన్నుల టమోటాలను వివిధ రైతు బజార్లకు పంపించామని ఈ రోజు పత్తికొండ మార్కెట్ లో టమోటాలు సేకరించి చిత్తూరు ప్రొసెసింగ్ యూనిట్ కి 10 మెట్రిక్ టన్నులు, రైతు బజార్లకు 15 మెట్రిక్ టన్నులు పంపిస్తామని మంత్రి వెల్లడించారు.
తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు సరుకు ఎగుమతి వర్షాల వల్ల తగ్గిందన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో టమాటా అమ్మకాలు మందగించాయని చెప్పారు. ఆదివారం రాప్తాడు మార్కెట్ కి 3000 మెట్రిక్ టన్నులు రాగా అందులో కేజీ టమోటా గరిష్టంగా 18 రూ, కనిష్టంగా 9 రూ జరిగిందని వివరించారు. టమోటాలకు ట్రేడింగ్ ధరను బట్టి ప్రస్తుతం మంచి ధర లభిస్తుందని ..ఏమైనా ఇబ్బందులు తలెత్తితే అన్ని విధాలుగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications