ఆంధ్రా మంత్రులు మా జోలికొస్తే మీకే కష్టం: మళ్ళీ ఘాటుగా మంత్రి హరీష్ రావు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలపై మరోమారు మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని, అసలు తను ఏమన్నానని వారు అంతగా మండిపడుతున్నారంటూ ప్రశ్నించారు. అసలు మీ దగ్గర ఏముందని మాట్లాడుతున్నారని ప్రశ్నించిన హరీష్ రావు తెలంగాణలో ఉన్నవి చెప్పమంటే దునియా చెబుతామంటూ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 56 లక్షలు ఎకరాల సాగుభూమి ఉందని, రైతు బీమా, రైతు బంధు పథకాలు తెలంగాణ రైతాంగానికి ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నిర్మించామని చెప్పుకొచ్చారు. ఇక మీ దగ్గర ఏమున్నాయో చెప్పాలంటూ ప్రశ్నించిన హరీష్ రావు, ఆరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అన్నారు.. కానీ ఇప్పుడేమో అడగరు అంటూ చురకలు అంటించారు.

ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వకపోయినా కేంద్రాన్ని ఒక మాట కూడా అనరని, విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరని అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో అధికారంలో ఉన్నవాళ్లు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరు కేంద్రాన్ని నిలదీయరని మండిపడ్డారు. విశాఖ ఉక్కును తుక్కుకు అమ్మినా పట్టించుకునే నాధుడే లేరని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రజలను గాలికి వదిలేసి ఎవరికి వారు స్వార్థ రాజకీయ ప్రయోజనాలను చూసుకుంటున్నారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ రెండు కలిసి నాశనం చేశాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆంధ్ర మంత్రులు అనవసరంగా మా జోలికి రావద్దన్న హరీష్ రావు, మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే మీకే మంచిదని హితవు పలికారు. ఢిల్లీలో ఉన్నవాళ్లు మనల్ని నూకలు తినాలని ఎగతాళి చేసినా, తెలంగాణ పోరాటం చేస్తుందని, తెలంగాణ ప్రజలంతా ఢిల్లీలో ఉన్నోళ్లకు నూకలు తినిపించడానికి రెడీ అయ్యారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కేంద్రంపై తాము పోరాటం చేస్తుంటే, ఏపీలో పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తున్నాయి అంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications