జగన్- లోకేష్ పాదయాత్ర తేడా ఏమిటో వెల్లడించిన మంత్రి
యువ గళం పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేసిన విమర్శలను మంత్రి జోగి రమేష్ తిప్పి కొట్టారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొనసాగుతోందీ యాత్ర. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా జిల్లాకు చెందిన మంత్రులు, ఏ నియోజకవర్గానికి వెళ్తే అక్కడి లోకల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేపైనా నారా లోకేష్ విమర్శలు గుప్పిస్తోన్నారు. ఇవి కాస్తా రాజకీయ వేడిని రాజేస్తోన్నాయి.
ఇన్ని రోజుల పాదయాత్రలో నారా లోకేష్ ఏం సాధించారు? టీడీపీ గ్రాఫ్ ఎలా ఉందనే విషయంపై ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు స్పందించారు. లోకేష్ పాదయాత్రకు భారీగా జనం తరలి వస్తోన్నారని టీడీపీ చెబుతోండగా.. దీన్ని కొట్టి పారేస్తోంది అధికార పార్టీ. నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ ఆందోళనకరంగా పడిపోతోందని, దీన్ని జాకీలేసి పైకి లేపే ప్రయత్నాలను అనుకూల మీడియా చేస్తోందంటూ చెబుతోంది.

తాజాగా ఈ పాదయాత్రపై గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పందించారు. చంద్రబాబు, నారా లోకేష్ పై ఘాటు విమర్శలు చేశారు. వారిద్దరినీ పెద్ద సైకో.. పిల్ల సైకోగా అభివర్ణించారు. వైఎస్ జగన్- నారా లోకేష్ మధ్య పులికి, పిల్లికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. జగన్ సింహం అయితే.. లోకేష్ ఓ గంటనక్క అని విమర్శించారు.
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్ విలేకరులతో మాట్లాడారు. 14 సంవత్సరాల పాటు చంద్రబాబు పరిపాలనను తామందరం చూశామని.. ఇప్పుడు జగన్ పాలనకు ఉన్న తేడా ఏంటో ప్రజలు స్పష్టంగా తెలుసుకుంటోన్నారని అన్నారు. తన 14 సంవత్సరాల పరిపాలనను చూసి, ఓటు వేయమని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు. వైఎస్ జగన్ తన మూడున్నరేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నారని గుర్తు చేశారు.
నారా లోకేష్ పాదయాత్ర మధ్యలోనే ఆగిపోతుందని జోగి రమేష్ జోస్యం చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, అందుకే యువ గళం పాదయాత్రకు కనీస ఆదరణ లేదని అన్నారు. ప్రజల దృష్టిని తన వైపునకు తిప్పుకోవడానికే వైఎస్ జగన్ ను నారా లోకేష్ విమర్శిస్తోన్నారని మండిపడ్డారు.
పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయినందున చంద్రబాబు, లోకేష్ ప్రస్టేషన్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేష్ అని ఎద్దేవా చేశారు. మహా శివరాత్రి నాడు వేలాదిమంది భక్తులు దర్శించుకునే శ్రీకాళహస్తిలో బహిరంగ సభను నిర్వహించడానికి బుద్ధి ఉన్న వాడెవడైనా పర్మిషన్ అడుగుతారా? అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications