చంద్రబాబు వెళ్తారా? వెళ్లరా?
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. దీనిపై చంద్రబాబు చర్చకు రావాలంటూ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు.
అమరావతి: మార్చి 14వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలి రోజు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమౌతుంది. అసెంబ్లీ ఎన్నిరోజుల పాటు కొనసాగించాలనే విషయంపై బీఏసీ భేటీలో ఖరారు చేస్తారు. బడ్జెట్ సమావేశాలు కావడం వల్ల రెండువారాల పాటు నిర్వహించే అవకాశాలు లేకపోలేదు.
ఈ సమావేశాలకు కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు హాజరు కాలేకపోవచ్చు. తాను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ ప్రతిజ్ఞ చేసి మరీ ఆయన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సారి సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబుపైనే అందరి దృష్టీ నిలిచింది. ఆయన సభకు వెళ్తారా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది.

అటు అధికార పార్టీ నాయకులు కూడా చంద్రబాబుకు సవాల్ విసిరుతోన్నారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలంటూ ఛాలెంజ్ చేస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ తన అనుకూల మీడియాతో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందంటూ గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. ఈ సాయంత్రం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అనుకూల మీడియాను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని జోగి రమేష్ అన్నారు. అనేక సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణను చూరగొంటోన్నారని, దీనికి భిన్నంగా టీడీపీ అనుకూల మీడియా కథనాలను వండివార్చుతోందని మండిపడ్డారు. సంక్షేమ ప్రభుత్వం, సామాజిక న్యాయం అంటే ఎలా ఉంటుందనేది చేతల్లో చూపించామని జోగి రమేష్ అన్నారు.

ఆయా అంశాలన్నింటి మీద దమ్ముంటే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చర్చకు రావాలని జోగి రమేష్ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సామాజిక న్యాయం, సంక్షేమ పథకాలపై చర్చిద్దామని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, వైఎస్ జగన్ హయాంలో అమలవుతోన్న పథకాలతో బేరీజు వేసుకుని.. అంశాలవారీగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దీన్ని చంద్రబాబు స్వీకరించాలని అన్నారు.












Click it and Unblock the Notifications