మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్: హైదరాబాద్‌లో ట్రీట్‌మెంట్
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 1800 లకు పైగా కొత్త పాజిటివ్ కేసులు రికార్డు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొత్త మరణాలు నమోదు కాకపోవడం కొంత ఊరట కలిగిస్తోంది. చిత్తూరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్క రోజులో వందకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 467 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో..
తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆయన సన్నిహితుడు, విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధా కోవిడ్ బారిన పడ్డారు. ఆ ఇద్దరు నాయకులకు కరోనా వైరస్ సోకింది. దీనితో వారిద్దరూ హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆ ఇద్దరు నేతలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది.

రంగా విగ్రహావిష్కరణ సభలో..
దీనితో ఇద్దరూ ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇదివరకు వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సభలో కొడాలి నాని, రాధా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధా లేవనెత్తిన అనుమానాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను పరామర్శించడానికి క్యూ కట్టారు.

టీడీపీ నేతల్లో ఆందోళన..
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సహా పలువురు మాజీ మంత్రులు, విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాను కలిశారు. తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా వంగవీటి రాధా కరోనా వైరస్ బారిన పడటం వల్ల విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కోవిడ్ నిర్దారణ పరీక్షలను చేయించుకోవాలంటూ వంగవీటి రాధా విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు..
రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతోంది. ఒక్కరోజులోనే 1831 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 467 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అనంతపురం-161, గుంటూరు-164, కృష్ణా-190, నెల్లూరు-129, శ్రీకాకుళం-122, విశాఖపట్నం-295 కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి-84, కడప-20, కర్నూలు-56, ప్రకాశం-46, విజయనగరం-40, పశ్చిమ గోదావరి-57 నమోదయ్యాయి.

నైట్ కర్ఫ్యూను ప్రవేశపెట్టినా..
కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను ప్రవేశపెట్టినప్పటికీ.. చివరి నిమిషంలో అందులో మార్పులు చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తొలుత జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలు చేసింది. సంక్రాంతి పండగ కోసం పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చే వారికి వెసలుబాటు కల్పించడానికే ఇందులో మార్పులు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications