'తల్లికి వందనం' అమలు, అర్హతల పై ప్రభుత్వం కీలక ప్రకటన..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. తల్లికి వందనం పథకం అమలు పైన స్పష్టత ఇచ్చింది. తాజాగా ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఈ మేరకు బడ్జెట్ లో తల్లికి వందనం పథకం అమలు కోసం నిధులు కేటాయించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, నిధుల కేటాయింపు విషయంలో రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా తల్లికి వందనం అమలు.. మార్గదర్శకాల పైన స్పష్టత ఇచ్చింది.
తల్లుల ఖాతాల్లో నిధులు
ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లికి వందన పథకం కింద బడి కి వెళ్లే ప్రతీ విద్యార్ధి తల్లి ఖాతాలో రూ 15 వేలు చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ఈ ఏడాది బడ్జెట్ లో ఈ పథకం అమలు కోసం కేటాయింపులు చేసారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ పథకం కింద తల్లుల ఖాతా ల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మంత్రి లోకేష్ అసెంబ్లీలో ఈ పథకం అమలు పైన మరోసారి స్పష్టత ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతీ తల్లి ఖాతాల్లో ఈ పథకం కింద నిధులు జమ చేస్తామని ప్రకటించారు.

హామీ ఇచ్చిన విధంగా
ప్రతీ ఇంటా చదువుకునే ప్రతీ ఒక్కరికి ఈ పథకం అమలు అవుతుందని వెల్లడించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామని చెప్పారు. బడ్జెట్‌లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించామని చెప్పారు. గత ప్రభుత్వం సంవత్సరానికి రూ.5,540 కోట్లు కేటాయించారని.. గతంతో పోలిస్తే ఇది 50 శాతం అధికమని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు కు బాబు సూపర్ - 6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణం గా తల్లికి వందనం పథకాన్ని ఆనాడు చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేసారు.
మార్గదర్శకాలు
మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంత మంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి లోకేష్ తేల్చిచెప్పారు. వైసీపీ మాత్రం రాష్ట్రంలో బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య 82 లక్షలుగా ఉందని.. ఇందు కోసం రూ 13 వేల కోట్లకు పైగా అవసరం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం దీని పైన స్పష్టత ఇచ్చింది. అర్హతల విషయంలో గతంలో 75 శాతం హాజరు తప్పని సరి చేసారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం ఈ నిబంధన కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. పథకం అమలు కోసం అధికార యంత్రాంగం మార్గదర్శకాల పైన కసరత్తు చేస్తోంది. త్వరలోనే వీటిని ఖరారు చేయనున్నారు.












Click it and Unblock the Notifications