తండ్రి అంతిమయాత్ర.. ఇరాన్ సుప్రీం లీడర్ రాకపై వీడని సస్పెన్స్!
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన 4 నెలల తర్వాత ఆయన ప్రభుత్వ అధికారిక అంతిమ సంస్కారాలకు ఇరాన్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జులై 4న టెహ్రాన్ నుంచి ఈ అంతిమ యాత్ర ప్రారంభమై జులై 9న మషద్‌లో ఖనన కార్యక్రమంతో ముగియనుంది. ఆయన భౌతికకాయాన్ని దేశంలోని పలు ప్రధాన నగరాల గుండా ఊరేగించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో లక్షలాది మంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ అంతిమ యాత్రలో అలీ ఖమేనీ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బహిరంగంగా పాల్గొంటారా లేదా అనే విషయంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు రాలేదు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా దళాలు జరిపిన దాడిలో అయతొల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. టెహ్రాన్‌లోని ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేయడంతో ఈ దారుణం జరిగింది. ఈ దాడి అనంతరం ఇరు పక్షాల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరిగాయి. ఆ సంక్షోభ సమయంలో అలీ ఖమేనీ స్థానంలో ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో తమ మాజీ సర్వోన్నత నాయకుడికి ఘనంగా వీడ్కోలు పలకాలని ఇరాన్ అధికారులు నిర్ణయించారు. ఈ అంతిమ సంస్కారాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం.

ఫిబ్రవరి 28న జరిగిన క్షిపణి దాడిలో 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని.. ఆయన ముఖానికి, కాలికి తీవ్ర గాయాలయ్యాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్యంపై అంతర్జాతీయంగా అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇరాన్ అధికారులు మాత్రం మొజ్తబా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. తన విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. మొజ్తబా తరఫున కేవలం లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే మీడియాకు అందుతున్నాయి. ఇటీవల ఇరాన్ నేషనల్ జ్యుడీషియరీ వీక్ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. గత యుద్ధ నేరాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయవ్యవస్థను ఆదేశించారు. అయినప్పటికీ ఆయన కెమెరా ముందుకు రాకపోవడంతో తండ్రి అంత్యక్రియల వేళ ఆయన వస్తారా లేదా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
సాధారణంగా ఇరాన్ అగ్ర నాయకత్వం ఇటువంటి పెద్ద నాయకుల అంతిమ సంస్కారాలను తమ ఐక్యతను చాటుకోవడానికి వేదికగా వాడుకుంటుంది. గతంలో అలీ ఖమేనీ కూడా తన పూర్వీకుడైన రుహోళ్లా ఖమేనీ స్మారక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ కూడా తన తండ్రి అంతిమ యాత్రకు హాజరవుతారని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి అధికారులు దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ.. మొజ్తబా ఖమేనీ తెర వెనుక ఉండి అమెరికాతో కాల్పుల విరమణ చర్చల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల కొన్ని నివేదికలు వెల్లడించాయి.
పెద్ద ఎత్తున తరలివచ్చే జనం మధ్యకు రావడం అనేది మొజ్తబా ఖమేనీకి భద్రత పరంగా ఖచ్చితంగా అత్యంత ప్రమాదకరమైన విషయమే. ప్రస్తుత పరిస్థితుల్లో తమ సుప్రీం లీడర్ భద్రత విషయంలో ఇరాన్ ఎలాంటి రిస్క్ తీసుకోదలచుకోలేదు. అయితే దీనికి మరో కోణం కూడా ఉంది. ఒకవేళ మొజ్తబా ఖమేనీ గనుక ఈ కార్యక్రమంలో బహిరంగంగా కనిపిస్తే.. ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లన్నింటికీ శాశ్వతంగా తెరపడుతుంది. అంతే కాకుండా తాము బలంగానే ఉన్నామనే గట్టి సందేశాన్ని ఇజ్రాయెల్, అమెరికా కూటమికి నేరుగా పంపినట్లవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications