పెట్రోల్ బంకుల్లో రేషన్ విధానం, సరఫరా - ప్రభుత్వం కీలక ఆదేశాలు..!!
ఏపీలో పెట్రోల్.. డీజిల్ సరఫరా క్రమేణా మెరుగు పడుతోంది. క్రమేణా పెట్రోల్ బంకులు అన్నీ పని చేస్తున్నాయి. అటు ప్రభుత్వం ఇంధన సమస్య పైన నిరంతరం సమీక్ష చేస్తోంది. మంత్రి మనోహర్ ఇంధన సమస్యపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధనం పక్కదోవ పట్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రేషన్ విధానంతో మంచి ఫలితాలు వచ్చాయని.. రాష్ట్ర వ్యాప్తంగా డ్రై అవుట్లు తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెట్రోల్.. డీజిల్ సరఫరా పైన మంత్రి మనోహర్ సమీక్ష చేసారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తత అవసరమని చెప్పారు. బల్క్ పద్ధతిలో డీజిల్, పెట్రోల్ ను పక్కదోవ పట్టించే అవుట్ లెట్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడవద్దు అని అధికారులను మనోహర్ ఆదేశించారు. ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు ఉన్నా సరే లేవని వాహనదారులకు చెబుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్దేశించారు. వినియోగదారుల సేవా కేంద్రం టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు వస్తున్న ఫిర్యాదుల్లో అధిక భాగం పెట్రోల్ బంకులు కావాలని ఇంధనం ఇవ్వడం లేదని వస్తున్నాయని వివరించారు.
రాష్ట్రంలో పెట్రోల్ బంకుల మూసివేతలు క్రమం గా తగ్గుతున్నాయని చెప్పారు. ఆయిల్ కంపెనీ నుంచి డిస్పాచ్ లు చాలా వేగంగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. వస్తున్న లోడ్లు వాహనదారులకు పూర్తిస్థాయిలో అందేలా చొరవ తీసుకోవాలని సూచించారు.

అధికారులకు కీలక ఆదేశాలు
అదే విధంగా అవుట్ లెట్లు ఈ సమయంలో ఇంధనాన్ని పక్కదోవ పట్టించాలని చూస్తే మాత్రం ఉపేక్షించవద్దని స్పష్టం చేసారు. ముఖ్యంగా రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని.. ఆక్వా రైతులు కీలక సమయంలో ఉన్నారని చెప్పారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇంధన కొరత రానివ్వద్దని సూచించారు. రబీ పంట కోతలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన విధంగా వారికి ఆయిల్ అందేలా చూడాలని సూచించారు. దీనికి వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకొని బాధ్యత తీసుకోవాలని నిర్దేశించారు. ముఖ్యంగా కీలకమైన సమయంలో పెట్రోల్ బంకుల్లో రేషన్ పద్ధతిని ప్రవేశపెట్టడం మంచి ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు కూడా దీనికి తగిన విధంగా స్పందించారని చెప్పుకొచ్చారు. ఇదే విధానాన్ని పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు కొనసాగించాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఉన్నతాధికారులు వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేసుకోవాలని మనోహర్ అధికారుల కు స్పష్టం చేసారు.













Click it and Unblock the Notifications