'కాపులను నట్టేట ముంచాడు': మహానాడులో మారుమ్రోగిన చిరంజీవి పేరు
తిరుపతి: కాపు ఉద్యమానికి మద్దతు తెలపాలంటూ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, చిరంజీవి, దాసరి నారాయణలను మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కలవడాన్ని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండో రోజు మహానాడులో మంత్రి నారాయణ మాట్లాడారు.
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. కాపుజాతిలో ముద్రగడ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ముద్రగడ పద్మనాభం వెనుక కాంగ్రెస్, వైసీపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. చిరంజీవి, దాసరి నారాయణరావుపై నారాయణ మండిపడ్డారు.
కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన ఈ ఇద్దరు నేతలు కాపు వర్గానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కాపుల సంక్షేమాన్ని పట్టించుకోని ఇటువంటి నేతలను దగ్గరకు చేర్చుకోవద్దని ఆ వర్గ ప్రజలకు సూచించారు. దాసరి నారాయణరావుని జగన్ కొన్ని రోజుల ముందు కలిశారని, ఇప్పుడు ముద్రగడ కూడా కలిశారని నారాయణ అన్నారు.

జగన్ చెప్పినట్లే ముద్రగడ పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. 2009లో చిరంజీవిని నమ్మి ఆయన వెంట నడిచిన లక్షలాది మంది కాపులను నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన దుయ్యబట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కాపులకు ఏ న్యాయం చేశారని నిలదీశారు. కాగా కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
కాపుల గుండెల్లో విషబీజాలు నాటు తున్నారు: బొండా ఉమా
కాపుల గుండెల్లో విషబీజాలు నాటుతున్నారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. తుని ఘటనను ఆయన ఏ ఉద్దేశ్యంతో చేపట్టారో, అక్కడ ఏం జరిగిందో మనం చూశామని అన్నారు. ముద్రగడ వెనుక కాంగ్రెస్, వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు.
కావాలనే కాపుజాతిలో ముద్రగడ చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. కాపు గర్జనను వైసీపీ వాడుకుందని, అక్కడ ఏం జరిగిందో మనం చూశామన్నారు. కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం నియమించిన ముంజునాథ కమిషన్ పని ప్రారంభించిందో లేదో అని ఒక్కసారన్నా ఆయన అడిగారా? అని నిలదీశారు.
ఏనాడైనా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కనీసం మాజీ మంత్రిగానైనా ఆడిగారా అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా టీడీపీ కాపులకు రూ. 1000 కోట్లు మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు. తద్వారా లక్షలాది మంది కాపు సామాజిక వర్గానికి మేలు జరుగుతందన్నారు.
కాపు ఉద్యమ సమయంలో చాలా మంది నేతలు కిర్లంపూడికి ఆయన్ని కలిసేందుకు వస్తే తలుపులేసుకున్నారని, కానీ ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చి కలుస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేదరికంలేని సమాజమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం వెళుతోందన్నారు. ఓసీ కులాల్లో అనేక పేద కుటుంబాలున్నాయని, వారికి కూడా లబ్ధి చేకూరేలా అనేక నిర్ణయాలను మహానాడులో తీసుకున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications