ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు: అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారాయణ
హైదరాబాద్: తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదని అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. తాము కేవలం నైపుణ్యాభివృద్ధి చేస్తామని చెప్పామే తప్ప ఎక్కడా ఉద్యోగాలు ఇస్తామనే వాగ్దానం చేయలేదన్నారు.
ఏపీలో అసెంబ్లీ బడ్జేట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాజధాని అమరావతి ప్రాంతంలో సీఆర్‌డీఏ చట్టంలో ఏవేం వాగ్దానాలు చేశారో చూడాలని, వాటిలో ఏ ఒక్కటీ ఈరోజుకు వరకు నెరవేర్చలేదని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేవనెత్తారు.
ఈ ప్రశ్నకు సమాధానంగా మంత్రి నారాయణ సమాధానమిస్తూ తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదని అన్నారు. తాము కేవలం నైపుణ్యాభివృద్ధి చేస్తామనే చెప్పామని అన్నారు. సీఆర్డీఏ పరిధిలోని ప్రజలను కావాలనే వైసీపీ నేతలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజధానికి 30 వేల ఎకరాల భూములిచ్చిన రైతులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు సీఎం సోమవారం కూడా సభలో చెప్పారని, కానీ.. రైతులు పొలాలు పోయి, వ్యవసాయం గానీ ఉపాధి గానీ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మీరు చెప్పిన ఇంటికో ఉద్యోగం ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి పైగా అర్హులైన యువతీ యువకులు ఉంటే వాళ్లలోంచి తొలి దశ కింద 113 మందిని మాత్రమే ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారని.. కానీ రూపాయి కూడా స్టైపండ్ ఇవ్వలేదు, కనీసం బస్సు చార్జీలు కూడా ఇవ్వలేదని అన్నారు.
వాళ్లు సీఆర్‌డీఏ ఆఫీసుకు వచ్చి, తాము బయట ఉద్యోగాలు కూడా వదులుకుని వచ్చామని, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరని అడిగితే పోలీసులతో బలవంతంగా కొట్టించి పంపారని అన్నారు. చివరకు అక్కడ ఓ డైరెక్టర్ రాజీనామా కూడా చేశారన్నారు. ఇప్పుడు మంత్రి అసలు ఇంటికో ఉద్యోగం తాము ఇస్తామని చెప్పలేదని అనడం దారణమన్నారు.
రాజధాని ప్రాంతంలో యువతీ యువకులకు కనీసం సిమెంటు బస్తాలు మోసే పనికూడా ఇవ్వకపోవడం దారుణమని, కనీసం పొలాలు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో ఒకరికైనా ఉద్యోగం ఇవ్వాలని.. లేనిపక్షంలో వాళ్లకు 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications