అమరావతి ప్లాన్, ఖర్చు వివరాలపై ప్రభుత్వం కీలక ప్రకటన..!!
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరింది. అమరావతి నిర్మాణం పై తన ప్రాధాన్యత ఇప్పటికే వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణలో మరోసారి పురపాలక శాఖ నారాయణకు కేటాయించారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో ఇదే శాఖ మంత్రిగా నారాయణ రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించారు. ఇప్పుడు తిరిగి అమరావతి బాధ్యతలను చంద్రబాబు ఆయనకే అప్పగించారు. దీంతో, అమరావతికి సంబంధించి మంత్రి నారాయణ కీలక సమాచారం వెల్లడించారు.
అమరావతిపై ముందుకు
ఏపీలో కొత్త ప్రభుత్వంలో పురపాలక శాఖా మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. 2014-19 వరకు మంత్రిగా పని చేసిన ఛాంబర్ లోనే తిరిగి నారాయణ తన విధులు ప్రారంభించారు. అమరావతి తమ శాఖ తొలి ప్రాధాన్యతగా వెల్లడించారు. గతంలో తాము దేశ విదేశాలు తిరిగి అమరావతి నిర్మాణ నమూనా ఖరారు చేసిన అంశాన్ని గుర్తు చేసారు. ప్రపంచంలోని అయిదు ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చి దిద్దాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేసారు. గతంలో ఖరారు చేసిన మాస్లర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం ఉంటుందని చెప్పారు.

మూడు దశల్లో నిర్మాణం
మూడు దశల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ వివరించారు. తొలి విడత నిర్మాణం కోసం రూ 48 వేల కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు. మూడు దశలకు కలిపి లక్ష కోట్ల వరకు ఖర్చు అంచనా వేసామని చెప్పుకొచ్చారు. త్వరలోనే రాజధాని పునర్ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. ముందుగా 3600 కిమీ రోడ్డుతో పాటుగా మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని నారాయణ వివరించారు. అదే విధంగా సచివాలయం, అసెంబ్లీ, ఉన్నతాధికారులు..ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
లక్ష కోట్ల ఖర్చు అంచనా
రాజధాని నిర్మాణం వల్ల అన్ని జిల్లాల్లోనూ డెవలప్ మెంట్ ఉంటుందని నారాయణ పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు ఖరారు చేసామని గుర్తు చేసారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అమరాతిని నిర్లక్ష్యం చేసిందన్నారు. త్వరలోనే ప్రభుత్వం అమరావతి విషయంలో పనులు ప్రారంభంతో పాటుగా వేగంగా ముందుకు వెళ్లేలా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణం తమ తొలి ప్రాధాన్యతగా నారాయణ వెల్లడించారు.












Click it and Unblock the Notifications