జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను దుమారంగా మారాయి. కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోనియా గాంధీ కాళ్లు పట్టుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.
కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డి కౌంటర్
దానికి కిరణ్ కుమార్ రెడ్డి డిసిసి అధ్యక్ష పదవి కోసంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ సీఎం కిరణ్‌కు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ వేశారు. నేను కాళ్లు పట్టుకున్నానని కిరణ్ అబద్ధాలు చెప్పారని మండిపడిన ఆయన, నేను కాంగ్రెస్‌లో సోనియాగాంధీ కాళ్లకే మొక్కలేదు.. చిదంబరం కాళ్లు పట్టుకొని కిరణ్ సీఎం అయ్యారు అంటూ మళ్ళీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ సీఎం గా పని చేసి బీజేపీ నుండి పోటీ సిగ్గు చేటు
కాంగ్రెస్‌ను మాజీ సీఎం కిరణ్ సర్వనాశనం చేశారని నిప్పులు చెరిగారు.. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసి.. బీజేపీ నుంచి పోటీ చేయడం సిగ్గుచేటు అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నన్ని రోజులు ఆయనతో సన్నిహితంగా ఉన్నారని, మరణించిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడొచ్చి వాగుతున్నాడు అని మండిపడ్డారు.
పుట్టపర్తి సాయిబాబా సంపద దోచింది నిజం కాదా
జగన్ ను జైల్లో పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి కాదా చెప్పాలంటూ ప్రశ్నించారు. వైయస్ జగన్ ను అరెస్టు చేస్తానని, రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి చిదంబరం కాళ్లు పట్టుకున్నారని అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని విమర్శించారు. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే 10 రోజులపాటు అక్కడే భౌతికకాయాన్ని ఉంచి, బ్రతికి ఉన్నారని చెప్పి ఆయన సంపదనంతా దోచుకుంది నిజం కాదా అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీ ప్రజలను మోసం చేసిన ద్రోహి
తాను తెలంగాణ వాడినని అసెంబ్లీ సాక్షిగా చెప్పారని ఆఖరి బాల్ నాదేనని చెప్పి ఏపీ ప్రజలను మోసం చేసిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. సమైక్యాంధ్ర పార్టీ పెట్టి మెడలో చెప్పులేసుకుని తిరిగిన ఇలాంటి ద్రోహి కి ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా తరిమి కొట్టాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications