జూన్ 4న గెలిచే పార్టీ ఏదో వెల్లడించిన పెద్దిరెడ్డి
Peddireddy Ramachandra Reddy: ఆధ్యాత్మిన నగరి తిరుపతి.. భక్తులతో పోటెత్తుతోంది. తాతయ్యగుంట గంగమ్మ జాతరను దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ తెల్లవారు జాము నుంచే వేలాదిమంది గంగమ్మను దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు.ప్రతి సంవత్సరం మే నెలలో తాతయ్యగుంట గంగమ్మ తల్లికి జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. 900 సంవత్సరాల చరిత్ర ఉన్న జాతర ఇది. గంగమ్మతల్లిని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి చెల్లెలిగా, తిరుపతి గ్రామదేవతగా పూజిస్తారు భక్తులు.
ప్రతి సంవత్సరం జాతర సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పుట్టింటి సారెను పంపిస్తుంటుంది. జాతర నాలుగవ రోజున శ్రీవారి తరఫున టీటీడీ అధికారులు, అర్చకులు ఈ సారెను తీసుకొస్తారు. పసుపు కుంకుమ, శేషవస్త్రాలు, కొత్త గంప, చేట, ఇతర వస్తువులను ఊరేగింపుగా తెచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు.నేడు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఈ వారం రోజుల పాటు భక్తులు విచిత్ర వేషధారణతో జాతరలో పాల్గొంటారు. అమ్మవారికి కోళ్లు, గొర్రెలు, మేకపోతులను బలి ఇచ్చి, తమ మొక్కులను చెల్లించుకుంటారు.

జాతర ప్రారంభమైన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. గంగమ్మ తల్లికి పట్టు చీరెను సమర్పించారు. ఇది ఆయన వ్యక్తిగత కార్యక్రమం. ఆలయానికి వచ్చిన పెద్దిరెడ్డికి కమిటీ ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. తనవెంట తీసుకొచ్చిన పట్టుచీరె, ఇతర పూజా వస్తువులను అమ్మవారికి సమర్పించారు.అనంతరం పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీసీ అధికారంలోకి రావడం ఖాయమైందని అన్నారు. జూన్ 4వ తేదీ.. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా భూస్థాపితం అవుతుందని చెప్పారు. కుప్పంలో కూడా తమ పార్టీ జెండా ఎగురడం ఖాయమైందని పేర్కొన్నారు. అక్కడ పోటీ చేసిన చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడని జోస్యం చెప్పారు.
విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని పెద్దిరెడ్డి అన్నారు. జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉండొచ్చిన పేర్కొన్నారు. వైఎస్ జగన్ పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా, సర్వతోముఖాభివృద్ధి చెందేలా చూడాలని గంగమ్మ తల్లిని కోరుకున్నట్లు వివరించారు.అంతకుముందు- తిరుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి.. గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అ్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్కడి సౌకర్యాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వయంగా వారికి భోజనాన్ని వడ్డించారు.












Click it and Unblock the Notifications