ప్రత్యేక హోదా ఇవ్వకూడదనేది బీజేపీ, టీడీపీ స్టాండా ? : ఏపీకి చంద్రబాబు, జీవీఎల్ ద్రోహులు : పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్‌కి ద్రోహులు టీడీపీ, బీజేపీయే అని మంత్రి పేర్నినాని విమర్శించారు . రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలో పెట్టడం దేశ ద్రోహమా అని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఎంపీ జీవీఎల్ పట్టుబట్టి మరి అజెండా నుంచి తీయించేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదనేది బీజేపీ, టీడీపీ స్టాండా..? అని నిలదీశారు. జీవీఎల్ ఎందుకు భయాందోళనకు గురవుతున్నారని విమర్శించారు.

టీడీపీ , బీజేపీవి నీచరాజకీయాలు
కేంద్ర హోంశాఖ కమిటీ అజెండాలోంచి హోదాను తీయిస్తే కానీ బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు నిద్రపట్టలేదా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు . ఎప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టి తమ ప్రభుత్వాన్ని తిడుతున్న టీడీపీ నేతలు అజెండా ప్రకటించినపుడు ఏమైపోయన్నారు. ఏ కలుగులో దాక్కున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పాలనో ఏపీ బాగుపడుతుందంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ , బీజేపీ నేతలు నీచరాజకీయాలు మానుకోవాలని పేర్ని నాని హెచ్చరించారు.

చంద్రబాబు సలహాలను జీవీఎల్ అమలు చేస్తున్నారు..
రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకుంటుంది చంద్రబాబే అని పేర్ని నాని ఆరోపించారు. ఏపీ విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాలని అనేక సార్లు ప్రధాని మోదీని సీఎం జగన్ కలిసి విన్నవించారని గుర్తు చేశారు. చంద్రబాబు సలహాలను జీవీఎల్ అమలు చేస్తున్నారన్నారు. అందుకే జీవీఎల్ పట్టబట్టి కేంద్ర కమిటీ అజెండాలోంచి ప్రత్యేక హోదా అంశాన్ని తప్పించేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదాకు జీవం పోస్తే ఏపీలో బీజేపీ ఇంకా చచ్చిపోతుందనేదే జీవీఎల్ ఆలోచన అని విమర్శించారు.

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా?
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని 2014 మ్యానిఫెస్టోలో బీజేపీ పెట్టిందా లేదా ? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఫలాలు అనుభవిస్తున్నాయా లేదా అని నిలదీశారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం ఉందా.. లేదా ?. రాష్ట్రంలోని కమలం నేతలకు చిత్తశుద్ధి ఉంటే వీటికి సమాధానం చెప్పాలని నాని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా? అని మండిపడ్డారు. హోల్‌సేల్‌గా హోదాను అమ్మేసి సాధించిన ప్యాకేజీ వల్ల ఏపీకి చంద్రబాబు ఏం చేశాని పేర్నినాని దుయ్యబట్టారు..












Click it and Unblock the Notifications