టీడీపీని కొట్టాలా..వైసీపీని కొట్టాలా..!!
నారా లోకేష్ పై మంత్రి ఆర్ కే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను తీర్చలేక ఏకంగా మేనిఫెస్టోను మాయం చేసిన టీడీపీని ప్రజలు నమ్మబోరని, గ్రామాల్లో ఆ పార్టీ నాయకులు తిరగలేని పరిస్థితి నెలకొందని అన్నారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. తనదైన శైలిలో చురకలు అంటించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వొద్దని, వారిని తరిమి కొట్టాలంటూ నారా లోకేష్ చెప్పడాన్ని ఆమె తప్పుపట్టారు. ఎవ్వర్ని కొట్టాలో ప్రజలు ఈ పాటికే నిర్ణయించుకున్నారని, 2024లో టీడీపీని ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పరిపాలన గురించి మాట్లాడే అర్హత లోకేష్ కు లేదని రోజా అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి మూడు సంవత్సరాల్లోనే 90 శాతానికి పైగా హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను వైఎస్ జగన్ నెరవేర్చారని చెప్పారు. 600లకు పైగా హామీలు గుప్పించి 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ- ఆ తరువాత ఏం చేసిందో అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు.

అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోను మాయం చేసిన ఘనత టీడీపీదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారని, ప్రజల కష్టాలను కళ్లారా చూసి, అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 90 శాతం హామీలు పూర్తి చేశారని చెప్పారు. నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి, ప్రజలకు ఏం చేశాడని రోజా నిలదీశారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను నమ్మించ వచ్చనే భ్రమలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారని ఎద్దేవా చేశారు.
అమ్మఒడి, విద్యా దీవెన, నాడు నేడు, ఆసరా, చేదోడు.. వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తూ, ప్రతి ఒక్కరి గుండెలో జగన్ స్థానం దక్కించుకున్నారని చెప్పారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలన్నింటినీ గాలికొదిలేశాడని ధ్వజమెత్తారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని నమ్మించి వంచించాడని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక.. సంపూర్ణ రుణమాఫీని లక్షన్నరకే పరిమితం చేశాడని విమర్శించారు.
ఇలా అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు, ఆయన పార్టీ నేతలను ప్రజలు తరిమి కొట్టాలా? లేక అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లోనే 90 శాతం హామీలను అమలు చేసిన వైసీపీని తరిమ కొట్టాలా? అని ప్రశ్నించారు. గ్రామాల్లో తిరగలేని పరిస్థితిని టీడీపీ నాయకులు ఎదుర్కొంటోన్నారని, ఏ హామీ ఇచ్చిన ఓట్లు అడగాలో వారికి అర్థం కావట్లేదని చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications