పవన్ పై రోజా సంచలనం: కలెక్షన్లు - వివాహానికి విశాఖ కావాలా..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖ కేంద్రంగా సాగుతున్న గర్జనలో మంత్రి పాల్గొని మద్దతు ప్రకటించారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వివరించారు. చంద్రబాబు ఎప్పుడు రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రత్యక్షం అవుతారని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ కోల్పోయామని.. మరోసారి ప్రాంతాల మధ్య విద్వేషాలు రాకుండా ఒకే ప్రాంతం పైన అభివృద్ధి సరైనది కాదనేది చరిత్ర స్పష్టం చేస్తుందన్నారు.
భవిష్యత్ లో ఇటువంటి విభజన సమస్యలు భవిష్యత్ తరాల మధ్య రాకూడదనే మూడు రాజధానుల నిర్ణయం జరిగిందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తాము ఆలోచన చేస్తుంటే..అదే ప్రాంతానికి చెందిన అచ్చెన్నాయుడు మద్దతు ఇవ్వకపోగా తిడుతున్నారని విమర్శించారు. తాము అమరావతికి అన్యాయం చేయటం లేదని..అమరావతితో పాటుగా సీమ - ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలనేదే తమ విధానమని చెప్పారు.

విశాఖ గర్జన కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి నేతలు వచ్చి మద్దతిస్తున్నారని వివరించారు. పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు బినామీగా రోజా ఆరోపించారు. గతంలో పవన్ కళ్యాణ్ అమరావతిలో టీడీపీ వ్యవహరించిన తీరును తప్పుబట్టారని రోజా గుర్తు చేసారు.
తిరిగి ఇప్పుడు చంద్రబాబు కోసం పవన్ ఫ్రేమ్ లోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో పవన్ తన దృష్టి లో కర్నూలు - విశాఖ రాజధాని అని చెప్పలేదా అని రోజా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్.. వివాహం చేసుకోవటానికి..సినిమా కలెక్షన్లు.. పోటీ చేయటానికి మాత్రమే విశాఖ కావాలా... విశాఖ రాజధానిగా వద్దా అంటూ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానులకు ప్రజా మద్దతు ఉందని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. విశాఖ గర్జన లో అన్ని ప్రాంతాలకు చెందిన మంత్రులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications