పురందేశ్వరి పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు - చంద్రబాబు మాట్లాడితే..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఆరోపణలను తీవ్రతరం చేసారు. వీటికి వైసీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. ఆర్దిక పరమైన అంశాలు..పాలన పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు పురందేశ్వరి వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు సీరియస్ గా స్పందిస్తున్నారు.
పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రులు ఖండిస్తున్నారు. తాజాగా పురంధేశ్వరిపై మంత్రి రోజా సీరియస్ అయ్యారు. పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం వస్తోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడితే పురంధేశ్వరి కూడా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు నుంచి నందమూరి కుటుంబం తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఏపీ అప్పుల్లో ఉందని పురంధేశ్వరి అనడం హాస్యాస్పదమన్నారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు తక్కువ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయాన్ని మంత్రి రోజా గుర్తు చేసారు. ఇదే తరహాలో మంత్రులు బొత్సా, విడదల రజనీ స్పందించారు.
అలాగే, పవన్ కల్యాణ్ పార్టీ పెట్టింది ప్యాకేజీల కోసమేనని మంత్రి రోజా ఫైరయ్యారు. పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని ఎద్దేవా చేసారు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయమని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలోనే తలకుమించిన అప్పులు చేశారని చెప్పుకొచ్చారు.
ఓ మ్యాప్ తీసుకుని చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో ఏం చేసారని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి గుర్తుకురాదని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు అభివృద్ధి గుర్తుకువస్తుందని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో నదులు అనుసంధానం కన్నా నిధుల అనుసంధానం చేయడంలోనే ఎక్కువ దృష్టి పెట్టారని రోజా ఆరోపించారు.












Click it and Unblock the Notifications