ఢిల్లీలో చక్రం తిప్పానంటారు - గల్లీలో గౌరవం దక్కక : చంద్రబాబు - పవన్ పై రోజా ఫైర్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. నాయకుడంటే ఎలా ఉండకూడదో చంద్రబాబు ఒక ఉదాహరణ అయితే, నాయకుడంటే ఎలా ఉండాలో జగన్ ను చూసి నేర్చుకోవాలని రోజా సూచించారు. 12 ఏళ్ల ముందు వైఎస్ ఆశయాల మీద నాటిన పునాది వైసీపీ జెండా అని చెప్పుకొచ్చారు. అలుపెరకుండా శ్రమించిన ధీరుడు మన జగన్ అని చెప్పారు. ఈ 12 ఏళ్లలో ఎన్నో ప్రజా పోరాటాలు చేశారని వివరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం ప్రజలకోసం పని చేస్తున్నారన్నారు. పేదల కోసం పుట్టిన పార్టీ వైసీపీగా పేర్కొన్నారు.

సమయం ఆసన్నమవుతోంది
2024 ఎన్నికల సమయం దగ్గర పడుతోందని అప్రమత్తం చేసారు. పార్టీని మరోసారి గెలిపించుకుని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు వెబ్ సైట్ నుంచి మ్యానిఫెస్టో తీసేశారని.. కానీ మ్యానిఫెస్టోను భగవద్గీతలా భావించిన వ్యక్తి జగన్ అని విశ్లేషించారు. గెలిచిన తర్వాత కార్యకర్తలను గాలికి వదిలేసిన వ్యక్తి చంద్రబాబు అయితే.. కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చిన వ్యక్తి జగన్ అని పోలిక చెప్పారు. ప్రజలను రాచి రంపాన పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అధికారంలోకి వస్తే వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసేస్తామని అచ్చెన్నాయుడు చెబుతున్నారంటూ గురివింద సామెత గుర్తు చేసారు. చంద్రబాబు,పవన్ లకు రోజా సవాల్ చేసారు.

ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం
మీకు దమ్ముంటే రండి...ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అంటూ ఛాజెంట్ విసిరారు. ఢిల్లీలో చక్రం తిప్పానని చంద్రబాబు కబుర్లు చెబుతారని.. కానీ గల్లీలో కూడా గౌరవం దక్కక ఏడుస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు మీటింగ్ లకు జనాలు రావడం లేదని.. చంద్రబాబు మమ్మల్ని చూసి భయపడుతున్నారంటూ ఎద్దేవా చేసారు. కరోనా సమయంలో ప్రజల కష్టాలు చంద్రబాబుకి గుర్తు రాలేదని దుయ్యబట్టారు. వైసీపీ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే ప్రతిపక్షాలు పారిపోవడం ఖాయమని రోజా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పేదలకు మంచి చేస్తుంది కాబట్టే కాలర్ ఎగరేసి మరీ ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామని వివరించారు. చంద్రబాబులా జగన్ ఎవరినీ వెన్నుపోటు పొడవలేదన్నారు.

జగన్ ను గెలిపించాల్సిన బాధ్యత మనదే
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. అలాంటి చంద్రబాబును నమ్ముకున్నందుకు కార్యకర్తలకైనా బుర్ర ఉండాలంటూ రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు అనే చీడ పురుగును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలన్నారు. అధికారంలోకి రావడం కోసం పవన్ కళ్యాణ్ తో పాటు అందరి కాళ్లూ పట్టుకుంటున్నారంటూ ఆరోపించారు. ఒకరు రెండు చోట్లా ఓడిపోయారు .. కానీ జగన్ మోహన్ రెడ్డిని ఓడిస్తానంటారంటూ ఎద్దేవా చేసారు. మరొకరేమో సొంత కొడుకునే గెలిపించుకోలేని అసమర్ధుడని విమర్శించారు. 2024లో మళ్లీ జగన్ ను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మన పై ఉందని రోజా పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications