మంత్రులు రోజా, అంబటి సీట్ల విషయంలో అనూహ్య నిర్ణయం..!!
వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. అవసరమైన చోట మార్పుల దిశగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. రెండో జాబితా విడుదలకు రంగం సిద్దమైంది. మొత్తంగా 30 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే పలువురు మంత్రులు సీట్లు కోల్పోతున్నారనే ప్రచారం సాగుతోంది. మంత్రులు రోజా, అంబటికి సీట్లు కష్టమే వాదన మొదలైంది. ఈ సమయంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మార్పులు - చేర్పులు
వైసీపీలో గెలుపే ప్రామాణికంగా..సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా తొలి విడతగా 11 మందితో మార్పులు చేసిన జాబితా విడుదల చేసారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ, అనంతపురం, ప్రకాశం జిల్లాలో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే పలువురు మంత్రులకు ఈ సారి సీట్లు ఉండవనే ప్రచారం సాగుతోంది. ప్రధానంగా మంత్రులు రోజా, అంబటి రాంబాబుకు అవకాశం లేదంటూ కొద్ది రోజులు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా జరిగిన కసరత్తులో మంత్రి రోజా పోటీ చేస్తున్న నగరి..రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్న సత్తెనపల్లి లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాలని నిర్ణయంచినట్లు తెలుస్తోంది.

రెండో జాబితా సిద్దం
మంత్రి రోజా 2014, 2019లో వరుసగా రెండు సార్లు నగరి నుంచి గెలుపొందారు. ఈ సారి నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే వస్తున్న అసమ్మతి కారణంగా సీటు ఇవ్వరనే అభిప్రాయం వినిపించింది. అయితే, తన సీటు విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఆమోదమేనని రోజా వెల్లడించారు. ఇప్పుడు నగరిలో రోజానే పోటీ చేస్తారని పార్టీ ముఖ్యుల నుంచి సమాచారం అందుతోంది. అదే విధంగా సత్తెనపల్లి లో అంబటి రాంబాబును మార్చి ఇతరులకు సీటు ఇస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా ఇదే నియోజకవర్గానికి చెందిన కొందరు తాడేపల్లికి వచ్చి తమకు సీటు ఇవ్వాలని కోరారు. కానీ..సత్తెనపల్లి నుంచి మరోసారి అంబటినే బరిలోకి దిగుతారని పార్టీ నాయకత్వం క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.
హోరా హోరీ పోరు
దీంతో..సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్ది కన్నా లక్ష్మీనారాయణ వర్సస్ అంబటి రాంబాబు మధ్య పోరు ఖాయంగా కనిపిస్తోంది. అటు గుంటూరు ఎంపీగా అంబటి రాయుడు పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ, పార్టీ తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మైలవరం నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పోటీ ఖాయమైంది. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరనే ప్రచారం వేళ తాజాగా సీఎంను కలిసారు. ఎవరు ప్రయత్నాలు వారు చేసుకున్నా తన నియోజకవర్గంలో మాత్రం తన పని తనను చేసుకోమని జగన్ చెప్పారన్నారు. చిన్న విషయాలు పట్టించుకోవద్దు, స్పందించవద్దని సీఎం చెప్పారన్నారు. ఇక రెండో జాబితా ను ఈ రోజు లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications