ఆదానీ క్యాంపుపై "ఆది" ఫ్యామిలీ రాళ్ల దాడి - ఢిల్లీ సీరియస్.!!
అదానీ సంస్థ క్యాంపు కార్యాలయం..సిబ్బందిపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో కొండాపురం రాగికుంట గ్రామం వద్ద విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. అక్కడ ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాలయం లో ఈ దాడి జరిగింది. కొద్ది రోజుల క్రితమే నియోజకవర్గంలో పరిణామాల పైన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించారు. కానీ, మార్పు రాలేదు. తాజాగా ఆదానీ సిబ్బంది పై దాడి ఘటన ఇప్పుడు కలకలంగా మారింది.
సిబ్బంది పై దాడి
ఆదానీ సంస్థ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం రాగికుంట గ్రామం వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. అక్కడ నేల చదును ప్రారంభించింది. ఈ సమయంలో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైన శివనారాయణ రెడ్డి, రాజేష్‌రెడ్డి తమ అనుచరులతో కలిసి అక్కడ అదానీ సంస్థ ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం పెరిగి క్యాంపు కార్యాలయం.. సిబ్బంది పైన దాడికి దిగారు.

చంద్రబాబు మందలించినా
స్థానిక ఎమ్మెల్యేతో చెప్పకుండా పనులు ఎలా ప్రారంభిస్తారంటూ వారి పైన రాళ్ల దాడికి పాల్ప డ్డారు. సంస్థ నుంచి డబ్బులు కోసమే ఈ రకంగా దాడికి దిగారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అనుచరులు నియోజకవర్గంలోని పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వచ్చిన వారికి బెదిరించి..వేధింపులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లు వెత్తాయి, దీంతో, సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డిని పిలిపించి మందలించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించడం, డబ్బులు అడగడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు స్వయంగా పిలిచి చెప్పినా మార్పు రాలేదు.
ఢిల్లీ ఆగ్రహం
తాజాగా ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు తమ అనుచరులతో కలిసి భారీగా వాహనాల్లో ఆదానీ క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లి దాడికి తిగారు. అక్కడ ఉన్న వాహనాలు, యంత్రాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనను ఆదానీ సంస్థ ముఖ్యులు కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారని తెలుస్తోంది. దీంతో, దాడికి పాల్పడిన వారి పైన ఆదానీ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే, సంస్థలో తమ వాహనాలను అద్దెకు పెట్టుకోవాలని..తమ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని మాత్రమే తమ వాళ్లు అడిగారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications