ఏపీకి మళ్లీ జగనే సీఎం
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార వైసీపీని ఢీ కొట్టాడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకం అవుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి పొత్తుపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా స్పందించారు.
మాజీ సీఎం చంద్రబాబు ఒకప్పుడు బీజేపీని తిట్టి .. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం ఢిల్లీ వాళ్ల కాళ్లు పట్టుకున్నారని ఆయన ఎద్దెవా చేశారు. సీఎం అవుతారని కలలు కన్న జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ తీవ్ర అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. ఎంతమంది కలిసి వచ్చిన జగన్‌ను ఎవరు ఏం చేయలేరని మంగళగిరి ఎమ్మెల్యే తెలిపారు.

రాబోవు ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని..జగనే మరోసారి ఏపీకి సీఎం అవుతారని ఆళ్ల రామకృష్ణారెడ్డి జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన ఆళ్ల వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్ చేరిన 15 రోజుల్లోనే తిరిగి మళ్లీ వైసీపీ గూటికి చేరుకున్నారు. మంగళగిరి నుంచి ఎవరిని బరిలోకి దింపిన కూడా వారి గెలుపుకు కృషి చేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
ఇక మంగళగిరి నియోజకవర్గంపై అధికార వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న గంజి చిరంజీవిని తప్పించి ఆయన స్థానంలో మురుగు లావణ్యను నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. అటు టీడీపీ నుంచి నారా లోకేష్ బరిలోకి దిగనుండటంతో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ప్రతిష్టాత్మంగా మారింది.












Click it and Unblock the Notifications