రోజా చెప్పు చూపారు: ఫిర్యాదు, వైసీపీ బస్సుయాత్ర
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు రోజా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, దళిత మంత్రికి చెప్పులు చూపించారని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు అనిత సభాపతి కోడెల శివప్రసాద్‌కు నోటీసు అందించారు. రోజా పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు అనుమతివ్వాలని సభాపతిని కోరారు. రోజా వ్యవహారం హక్కుల ఉల్లంఘనగా ఉందని చెప్పారు.
మరోవైపు, సభాపతి పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీని పైన అధికార తెలుగుదేశం పార్టీ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్పీకర్ పైన వైసీపీ ఇచ్చిన అవిశ్వాస నోటీసు పైన చర్చ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేల ర్యాలీ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం అసెంబ్లీకి ర్యాలీగా బయలు దేరారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహం వద్ద సభ్యులు ధర్నా చేశారు. గురువారం నుంచి బస్సుయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ అధ్యక్షులు జగన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ వెల్లడించారు.
ఏపీ అసెంబ్లీలో అధికార పక్షం వైఖరిని నిరసిస్తూ తమ పార్టీ ఆందోళన చేపట్టనుందని ఆ పార్టీ నాయకుడు జ్యోతుల తెలిపారు. ప్రజల్లోకి వెళ్లేందుకు గురువారం నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నామన్నారు.
అసెంబ్లీలో తమ గొంతు నొక్కారని చెపుతూ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేసి అసెంబ్లీ వద్ద ధర్నా చేస్తామన్నారు. రేపు మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. సభాపతి తీరు సిగ్గుచేటు అన్నారు. కోడెల నియంతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications