కూటమిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కుంపటి రాజేస్తున్నాయా ? అసలేం జరుగుతోంది ?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవలే నోటిఫికేషన్ వచ్చింది. ఈ క్రమంలోనే కూటమి పార్టీలు అభ్యర్ధులను కూడా ప్రకటించాయి. మొత్తం ఐదు స్థానాల్లో మూడు టీడీపీకి, ఒకటి జనసేనకు, మరొకటి బీజేపీ దక్కించుకున్నాయి. ముందుగా ఎమ్మెల్యే కోటా ఐదింటిలో జనసేన పార్టీ తరఫున కొణిదెల నాగబాబు దక్కించుకున్నారు. టీడీపీ తరపున బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడుకు ఛాన్స్ ఇచ్చారు. చివరి నిమిషంలో భాజపా పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో ఆ పార్టీకి ఒక సీటు కేటాయించారు. సోము వీర్రాజుకు బీజేపీ పెద్దలు అవకాశం ఇచ్చారు.
ఇప్పటికే నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు ఈరోజు చివరి రోజు కావడంతో కూటమికి చెందిన మిగిలి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీడీపీ అభ్యర్థులు బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. మార్చి 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

అయితే మరోవైపు ఎమ్మెల్సీ స్థానం కోసం ఆశపెట్టుకున్న నేతలు కొంత మేర అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ స్థానం ఆశించిన వారిలో సుమారు 25 మంది ఉన్నారు. వారిలో దాదాపు 10 మంది మాత్రం సీరియస్‌గా ప్రయత్నాలు చేయగా.. పలువురు మాత్రం ఏకంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను సైతం తమ మద్దతుదారులతో కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ఛాన్స్ దక్కించుకొని నేతల్లో ముఖ్యంగా హర్ట్ అయిన వారిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి జవహర్, దువ్వారపు రామారావు, టీడీ జనార్ధన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
సదరు నేతలను ఇప్పటికే పార్టీ పెద్దలు సైతం ఫోన్ లో మాట్లాడి సర్దిచెప్పారని అంటున్నారు. ఈసారి అవకాశం దక్కని వారికి 2027లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయని అప్పుడు అవకాశం కల్పిస్తామని ఆశావహులకు పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఇక లేటెస్ట్ గా ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో 23 ఏళ్లుగా ప్రయాణం కొనసాగుతోందని.. తనకు పదవి రానంత మాత్రన బాధపడాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ సమీకరణాల కారణంగా పదవి ఇవ్వలేకపోయి ఉండొచ్చన్నారు. చంద్రబాబు తనకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని వ్యాఖ్యానించారు.
మరో వైపు ఎమ్మెల్సీ స్థానం ఆశించి భంగపడ్డ దేవినేని ఉమామహేశ్వరరావు సైతం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నోరు విప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికైన కావలి గ్రీష్మ, బీధ రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడుకు దేవినేని ఉమా అభినందనలు తెలియజేశారు. శాసనమండలిలో పార్టీ. ప్రజల వాణిని వినిపించడంతో పాటు, ప్రతిపక్ష సభ్యుల విమర్శలను తిప్పికొట్టడంలో సమర్థవంతంగా పనిచేసి వైసీపీ దుర్మార్గపు నిర్ణయాలను, అవినీతిని ఎండగట్టాలని సూచించారు.
★ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కావలి గ్రీష్మ, బీధ రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు గార్లకు నా అభినందనలు
— Devineni Uma (@DevineniUma) March 10, 2025
★శాసనమండలిలో పార్టీ మరియు ప్రజల వాణిని వినిపించడంతోపాటు.. ప్రతిపక్ష కుటిల విమర్శలను తిప్పికొట్టడంలో సమర్థవంతంగా పనిచేసి వైసీపీ దుర్మార్గపు నిర్ణయాలను అవినీతిని ఎండగట్టడంలో ముందుండాలని… pic.twitter.com/7d7l6JkwlV
అయితే నేతలు బయటికి అంతా బాగానే ఉన్నట్టు చెబుతున్నప్పటికీ.. లోపల మాత్రం అసంతృప్తిగానే ఉన్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రతిసారీ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని సొంత నేతలకు అన్యాయం జరుగుతోందని టీడీపీలోని మరో వర్గం సైతం ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం కూటమి నేతల్లో ఒకింత కుంపటి రాజేసిందని తెలుస్తోంది. చూడాలఈ మరి రానున్న రోజుల్లో అయినా చంద్రబాబు టీడీపీ నేతలను సంతృప్తి పరుస్తారా లేదా అని...












Click it and Unblock the Notifications