ఎమ్మెల్యే వసంత సంచలన నిర్ణయం - రాపాక తేల్చేసారు..!!
వైసీపీలో ఇంఛార్జ్ మార్పు పైన కసరత్తు కొనసాగుతోంది. సీఎం జగన్ సామాజిక సమీకరణాలు - గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను మార్చతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ నేరుగా మంత్రాంగం నిర్వహించారు. ఈ రోజు క్యాంపు కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యేలతో సమీక్షలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని డిసైడ్ అయ్యారు. రాపాక సైతం కీలక నిర్ణయం ప్రకటించారు.
కసరత్తు వేళ : ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల మార్పు కసరత్తు చేస్తున్నారు. మార్పు చేసేవారిని తన వద్దకు పిలిపించి మాట్లాడుతున్నారు. ఎందుకు మార్చాల్సి వస్తుందో వివరిస్తున్నారు. వారికి భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు. బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటుగా గుంటూరు, ప్రకాశం, సీమలోని మూడు జిల్లాల్లో మార్పులు జరుగున్నాయి. తొలి జాబితాలో 11 మందిని మార్పు చేసిన జగన్..తుది జాబితా పైన మంత్రాంగం చేస్తున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో పట్టు కొనసాగించేదుకు ప్రయత్నాల చేస్తున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను సీఎంఓకు రావాలని పిలుపు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఆయన సీఎం వద్దకు రాలేదు.

వసంత నిర్ణయం : వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మైలవరం లో కొంత కాలంగా జోగి రమేష్ మద్దతు దారులు వర్సస్ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మధ్య రాజకీయంగా విభేదాలు వచ్చాయి. దీంతో నేరుగా పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకొని వచ్చే ఎన్నికల్లో సీటు పైన వసంతకు హామీ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న మార్పులు - చేర్పుల వేళ వసంతకు పిలుపు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమయంలోనే వసంత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కీలక నిర్ణయం ప్రకటించారు. 2019 ఎన్నికల్లో రాపాక జనసేన నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత వైసీపీకి దగ్గరయ్యారు.

రాపాక క్లారిటీ : వచ్చే ఎన్నికల్లో రాపాకను అమలాపురం ఎంపీగా పోటీ చేయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని పైన రాపాకతోనూ చర్చ జరిగినట్లు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో చేస్తున్న మార్పుల పైన పార్టీ నేతల నుంచి సమస్యలు ఎదురు కావటం లేదని..అందరికీ జగన్ భవిష్యత్ పైన హామీ ఇస్తున్నారు. తనకు ఎమ్మెల్యేగా అయినా..ఎంపీగా అయినా ఏ అవకాశం ఇచ్చినా జగన్ తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాపాక స్పష్టం చేసారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మంత్రాంగం చేసిన సీఎం జగన్ ఒకటి రెండు రోజుల్లోనే మార్పులకు సంబంధించి అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కొందరు మంత్రులను ఎంపీలుగా పంపేలా నిర్ణయం జరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications