
జైలు నుంచి బయటకు రాగానే మా అబ్బాయి మిమ్మల్నందరినీ చంపేస్తాడు??
తన మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టై జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అనంతబాబు తల్లి, అక్క సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను బెదిరించారు. వారిపై దౌర్జన్యానికి దిగారు. జైలు నుంచి బయటకు రాగానే అనంతబాబు మిమ్మల్నందరినీ చంపేస్తాడని బెదిరించారు. దీంతో హడలిపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాకినాడ భానుగుడి సెంటర్ సమీపంలోని శంకర్ టవర్స్ లో కాపలాదారుగా పనిచేస్తున్న సుబ్రమణ్యం బాబాయ్ శ్రీను దగ్గరకు వచ్చిన అనంతబాబు తల్లి, అక్క శ్రీనుతోపాటు ఆయన భార్యా, పిల్లలపై బూతుపురాణం అందుకున్నారు. బెయిల్ పై బయటకు రాగానే మీ అంతు చూస్తాడంటూ హెచ్చరించారు. దీంతో భయపడిన శ్రీను పోలీసులను ఆశ్రయించారు. తిడుతున్నారని, చంపేస్తామంటున్నారని, రక్షించాలంటూ కోరారు.

శ్రీను ఫిర్యాదుపై కాకినాడ టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. మొదట ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్న శ్రీనుకు దళిత సంఘాలు అండగా నిలబడ్డాయి. దగ్గరుండి తీసుకువెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయించారు. కాకినాడలో ఈ సంఘటన సంచలనం కలిగించింది. మే 19వ తేదీన ప్రమాదవశాత్తూ మరణించాడంటూ సుబ్రమణ్యం మృతదేహాన్ని అనంతబాబు తన కారులో తీసుకొచ్చి ఇంటిదగ్గర అప్పగించాడు. ఈ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న అనంతబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయినా ఎమ్మెల్సీగానే కొనసాగుతున్న అనంతబాబు బెయిల్ పై బయటకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.