MLC bypoll: పవన్ యూజ్ & త్రో-త్యాగం వర్మది..ఫలితం ఇంకొకరిదా..?
Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. శాసన మండలిలో ఖాళీ అయిన రెండు స్థానాల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. అభ్యర్థులను ఖరారు చేసింది.
12న ఎన్నిక..
ఈ నెల 12వ తేదీన ఎన్నికలు షెడ్యూల్ అయ్యాయి. ఈ రెండూ కూడా ఎమ్మెల్యేల కోటాకు చెందినవే. అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటం వల్ల అవి టీడీపీ, జనసేన ఖాతాలో పడటం ఖాయం. పోటీ పడే అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఫలితంగా ఈ రెండు స్థానాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనప్రాయం కానుంది.

సీఆర్‌కు మళ్లీ ఛాన్స్..
వైఎస్ఆర్సీపీకి చెందిన సీ రామచంద్రయ్య, ఇక్బాల్.. తమ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఎన్నికలు అనివార్యం అయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య మళ్లీ మండలికి ఎంపికయ్యారు. ఇక్బాల్ రాజీనామా వల్ల ఖాళీ అయిన స్థానానికి జనసేన సీనియర్ నాయకుడు పిడుగు హరిప్రసాద్ నామినేట్ అయ్యారు.
పిఠాపురం వర్మ పరిస్థితేంటీ?
ఇక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ.. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మను నామినేట్ చేయకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. ఎన్నికల తరువాత పవన్ కల్యాణ్ పూర్తిగా మారిపోయారని చెబుతున్నారు.
పవన్ కోసం సీటు త్యాగం..
పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు ఎస్‌వీఎస్ఎన్ వర్మ. పవన్ కల్యాణ్ పోటీ చేయకపోయివుంటే పిఠాపురం టికెట్ వర్మ ఖచ్చితంగా దక్కి ఉండేదనడంలో సందేహాలు అక్కర్లేదు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయడానికి పవన్ కల్యాణ్.. పిఠాపురాన్ని ఎంచుకోవాల్సి రావడం వల్ల తప్పుకోవాల్సి వచ్చింది.
అప్పట్లో హామీ..
సీటును త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు అప్పట్లో. శాసనమండలికి పంపిస్తామంటూ అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్లు వర్మ వర్గీయులు తేల్చి చెబుతున్నారు. తీరా ఎన్నికలయ్యాక.. టీడీపీ సీ రామచంద్రయ్యను, జనసేన హరిప్రసాద్‌ను ఎంపిక చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నట్లు తెలుస్తోంది. పవన్ యూజ్ అండ్ త్రో రాజకీయాలను ఒంటబట్టించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తోన్నాయి.
తొలి ప్రాధాన్యత..
స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్.. తప్పిస్తే మున్ముందు మండలికి జరిగే ఎన్నికల్లో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి అభ్యర్థుల ఎన్నిక ఏకపక్షంగా మారొచ్చు. అలాంటి సందర్భంలో వర్మను ఎమ్మెల్సీగా పంపించే అవకాశాలు లేకపోలేదు. తొలి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదు అనే దానిపై ఇటు వర్మ అభిమానులు అటు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications