జగన్ మార్క్ విక్టరీ..!!
స్థానిక సంస్థల కోటాలో అయిదు స్థానాల్లో అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఇక మిగిలిన నాలుగు స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంటుంది.
అమరావతి: రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. మొత్తం 14 నియోజకవర్గాలకు మార్చిలో పోలింగ్ జరుగనుంది. ఇందులో స్థానిక సంస్థలు-9, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు-5 ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఏకగ్రీవ విజయాలను ఖాయం చేసుకుంటోంది. ఇప్పటికే అయిదు చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ నెల 24వ తేదీ తరువాత నామినేషన్ల పరిశీలన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులు మాత్రమే మిగిలారు. ఇవ్వాళ నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. దీనితో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఇక మిగిలిన స్థానాల్లోనూ పోలింగ్ ఉంటుంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో ఏకగ్రీవమైన వారిలో అనంతపురం-మంగమ్మ, చిత్తూరు-డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, కడప- పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, తూర్పు గోదావరి-కుడుపూడి సూర్యనారాయణ, నెల్లూరు- మేరిగ మురళీధర్ ఉన్నారు. స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల కోసం మార్చి 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఇక శ్రీకాకుళం- నార్తు రామారావు, పశ్చిమ గోదావరి- వంకా రవీంద్రనాథ్, కావూరు శ్రీనివాస్, కర్నూలు- ఏ మధుసూదన్, ఎమ్మెల్యేల కోటా నుంచి విజయనగరం- వీవీ సూర్యనారాయణ రాజు, బాపట్ల- పోతుల సునీత, విశాఖపట్నం- కోలా గురువులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ- బొమ్మి ఇజ్రాయెల్, ఏలూరు- జయమంగళ వెంకటరమణ, గుంటూరు-చంద్రగిరి ఏసురత్నం, పల్నాడు- మర్రి రాజశేఖర్ ఎన్నిక కావాల్సి ఉంది. గవర్నర్ కోటాలో అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కుంభా రవిబాబు, కాకినాడ నుంచి కర్రి పద్మశ్రీ నామినేట్ కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications