2024 లో అధికారం దక్కేదెవరికి - టీడీపీ కొత్త లెక్కలు : పబ్లిక్ పల్స్ తేల్చిందేంటి..!!
ఏపీలో 2024లో అధికారం దక్కేదెవరికి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఈ చర్చ మొదలైంది.
ఏపీలో 2024లో అధికారం దక్కేదెవరికి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఈ చర్చ మొదలైంది. ఎవరు పొత్తులు పెట్టుకున్నా..వైసీపీ సింగిల్ గా పోటీ చేయాలని డిసైడ్ అయింది. గెలుపు తమదనేని ధీమా తో ఉంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ క్రమంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అనూహ్యంగా టీడీపీ పుంజుకుంది. విశాఖ .. రాయలసీమలోనూ పట్టభద్రులు టీడీపీకే పట్టం కట్టారు. ఈ ఫలితాలు వైసీపీకి షాక్ ఇచ్చాయి. ఈ ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయా..ఏపీలోని పబ్లిక్ పల్స్ తాజాగా తేల్చిందేంటి.

108 నియోజకవర్గాలు..7 లక్షల ఓటర్లు
ఏపీలో జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మూడు నియోజకవర్గాల కోసం ఏపీలోని 108 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. దాదాపు ఏడు లక్షల మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఉన్న ఓటర్లతో పోలిస్తే ఈ సంఖ్య చాలా స్పల్పం. కానీ, పబ్లిక్ మూడ్ తెలుసుకొనే అంశంలో ఈ సంఖ్యను పరిగణలోకి తీసుకోవాల్సిందే.
అందునా విశాఖ రాజధాని నిర్ణయంతో ఉత్తరాంధ్రలో టీడీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిందని వైసీపీ అంచనాలతో ఉంది. అదే విధంగా రాయలసీమలో సామాజిక సమీకరణాలతో వైసీపీ ఏకపక్షంగా నిలుస్తోందనే అభిప్రాయం తో ఉంది. కానీ, పట్టభద్రులు మాత్రం టీడీపీ వైపే నిలిచారు. వైసీపీ కంచుకోటల్లో టీడీపీ బలం పెరగటం తో వైసీపీ ఎన్నికల వేళ తమ బలహీనతలను సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టీడీపీలో పెరుగుతున్న అంచనాలు
టీడీపీ నేతలు పైకి అమరావతి నినాదంతో ముందుకు వెళ్తున్నా.. మూడు రాజధానుల నినాదం తమకు ఏ మేర నష్టం చేస్తుందనే ఆందోళన లోలోపల ఉంది. కానీ, విశాఖ రాజధాని అని పదే పదే చెబుతున్నా.. ఉత్తరాంధ్ర పట్టభద్రులు వైసీపీని కాదని..టీడీపీకి ఓట్లు వేయటంతో ఆ ప్రాంతంలో కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న టీడీపీ నేతల్లో జోష్ పెంచుతోంది.
అదే విధంగా కర్నూలులో న్యాయ రాజధానికి టీడీపీ వ్యతిరేకం అనే ప్రచారం ఉంది. కానీ, రాయలసీమలో వైసీపీకి పట్టు ఉన్న ప్రాంతాల్లోనే పట్టభద్రులు టీడీపీ వైపే మొగ్గు చూపారు. సామాజిక వర్గాల సమీకరణాల్లోనూ ఇక్కడ మార్పు కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో కారణాలు ఏవైనా వైసీపీ పూర్తిగా వెనకబడింది. టీడీపీ ప్రతీ రౌండ్ లోనూ ఆధిక్యత ప్రదర్శించింది. ఇది అధికార పార్టీ నిర్ణయాల పై వ్యతిరేకతా.. ప్రభుత్వ వ్యతిరేకతా ..టీడీపీకి పెరుగుతున్న సానుకూలతా అనే అంశాల పైన ఇప్పుడు విశ్లేషణలు మొదలయ్యాయి.

అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా
ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల పైన ప్రభావం ఉంటుందా. ఇప్పుడు ఈ చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే, వైసీపీ నేతలు మాత్రం దీంతో విభేదిస్తున్నారు. తాము మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అంగీకరిస్తున్నారు. అదే సమయంలో ఇది పట్టభధ్రుల వరకు మాత్రమే పరిమితం అయిన ఎన్నికగా వివరిస్తున్నారు.
వైసీపీ తొలి నుంచి లబ్దిదారులు..సామాజిక సమీకరణాల పైనే ఫోకస్ చేసింది. అయితే, పట్టభద్రుల ఓటింగ్ లోనూ వైసీపీ నమ్ముకున్న వర్గాల ఓటర్లు ఉన్నారనేది టీడీపీ చేస్తున్న వాదన. ఈ లెక్కలు ఎలా ఉన్నా..ఇప్పుడు రాజధాని ఇస్తామని చెప్పిన ఉత్తరాంధ్ర - వైసీపీ కంచుకోట రాయలసీమలో మారిన లెక్కలు వైసీపీకి హెచ్చరికగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో..ఈ ఫలితాలు కంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకం కావటంతో సీఎం జగన్ కొత్త వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications