జగన్‌ను టార్గెట్ చేసిన మోదీ..!
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం మొదలుపెట్టడానికి సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు తమ తొలి ఎన్నికల సభను ఆదివారం నిర్వహించడానికి రెడీ అవుతున్నాయి.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ నుంచే ఎన్నికల ఉమ్మడి ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. ఈ సభను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పొత్తు ఖరారైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న బహిరంగ సభ ఇదే. ఎన్డీఏ కూటమి ఏపీకు ఏం చేయబోతుందనే విషయాన్ని ఈ సభా వేదిక నుంచి వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో పాటు, ప్రధాని మోదీ కూడా హాజరుకానుండటంతో ఈ సభపై ఉత్కంఠ నెలకొంది. ఈ సభలో ఎలాగూ.. జగన్ టార్గెట్‌గా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు విమర్శలు చేస్తారనే విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రధాని మోదీ సైతం తొలిసారి జగన్ సర్కార్ మీద విమర్శనాస్త్రాలు సంధించడానికి సిద్ధమవుతున్నారు. మోదీతో జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి జగన్ సర్కార్ తమ మద్దతు తెలుపుతూ వస్తోంది. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థులు మారిపోవడంతో కూటమికి జగన్ ప్రత్యర్థిగా మారారు. జగన్ ఇప్పుడు తమ ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ప్రధాని మోదీ తప్పనిసరిగా వైసీపీపై విమర్శలు చేయాల్సి ఉంటుంది. దీంతో జగన్‌పై మోదీ విమర్శలు చేయాల్సిన పరిస్థితి. అయితే జగన్‌ను మోదీ ఎలా టార్గెట్ చేసుకుంటారనేది చూడాల్సి ఉంది.

రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి దాని మీద జగన్ ప్రభుత్వాన్ని మోదీ విమర్శించే అవకాశం ఉంది. అనుకున్న సమయానికి పోలవరం పూర్తి కాలేదు .. దీనిపై కూడా మోదీ జగన్‌ను ఇరుకున పెట్టే అవకాశం లేకపోలేదు. ఇక రాష్ట్రంలో అభివృద్ది జరగలేదని.. వచ్చిన పరిశ్రమలే రాష్ట్రం నుంచి తరలి పోయాయని చెప్పి జగన్ ప్రభుత్వాన్ని మోదీ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.
వీటితో పాటు, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల సూచనలతో మరికొన్ని అంశాలపై ప్రధాని మోదీ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం కనినిస్తోంది. మొత్తానికి జగన్ సీఎం అయిన తరువాత తొలిసారి ప్రధాని మోదీకి టార్గెట్ అయ్యారన్న మాట పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరి ఈ సభలో కూటమి నేతలు చేసే విమర్శలను వైసీపీ నాయకులు ఎలా తిప్పికొడతారో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications