వైసీపీలోకి మోపిదేవి, సీటు పై తేల్చి చెప్పిన జగన్..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం 2029 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అటు మాజీ సీఎం జగన్ సైతం తిరిగి అధికారమే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. పార్టీలో చేరికల పైన ఫోకస్ చేసారు. పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీలో తాజాగా చేరిన చేరికలతో.. కొత్త లెక్కలు మొదలయ్యాయి.
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత అనేక మంది సీనియర్లు పార్టీ వీడారు. కొందరు కూటమి పార్టీల్లో చేరారు. కాగా.. ఇప్పుడు వైసీపీలో చేరికల పైన పార్టీ ఫోకస్ చేసింది. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. మోపిదేవి శ్రీనివాసరావు ఒక పార్టీ సభ్యుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా పార్టీలోకి వచ్చారని జగన్ పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఆయన తన రాజకీయ భవిష్యత్తును ఉంచారని, ఆయనకు అన్ని విధాలా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

సీటు ఇవ్వలేను.. చట్ట సభకు పంపిస్తా
రేపల్లె నుంచి వైసీపీలో ముఖ్య నేతగా వ్యవహరించిన మోపిదేవి వెంకట రమణ పార్టీకి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆ తరువాత రేపల్లె పార్టీ ఇంఛార్జ్ గా పీటా నాగ మోహనకృష్ణ కు జగన్ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు శ్రీనివాసరావు పార్టీలో చేరిక సమయంలో సీటు పైనా జగన్ స్పష్టత ఇచ్చారు. రేపల్లె నియోజకవర్గంలో యువ నాయకుడు పీటా నాగమోహనకృష్ణ పార్టీ కోసం చురుకుగా పనిచేస్తున్నారని, ఆయనకు అందరి సహకారం అవసరమని అన్నారు. మోపిదేవి శ్రీనివాసరావు కూడా నాగమోహనకృష్ణను తన సొంత తమ్ముడిలా భావించి, ఆయన గెలుపు బాధ్యత తీసుకున్నారని తెలిపారు. మోపిదేవి చేస్తున్న సేవలను ఎప్ప టికీ మర్చిపోమని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను చట్టసభలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రానున్న రోజుల్లో గోదావరి జిల్లాల నుంచి వైసీపీలో చేరికలు ఉంటాయని పార్టీ నేతలు వెల్లడించారు. ఈ కొత్త చేరికలు వైసీపీకి ఏ మేరకు కలిసి వస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications