చంద్రబాబు కేసుల విచారణ మరింత ఆలస్యం ? సుప్రీం, ఏసీబీ కోర్టులో అప్ డేట్ ఇదే..!
ఏపీలో స్కిల్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరింత వెయిటింగ్ తప్పేలా లేదు. తనపై సీఐడీ దాఖలు చేసిన కేసును, రిమాండ్ ను క్వాష్ చేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలు చేసిన ఎస్ఎల్పీపై అత్యవసరణ విచారణ కోరుతూ ఆయన లాయర్ సిద్ధార్ధ్ లూధ్రా నిన్న సీజేఐ చంద్రచూడ్ వద్ద ప్రస్తావించారు. దీనిపై ఇవాళ విచారణ జరగాల్సి ఉంది.అలాగే ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ల పై విచారణ జరగాల్సి ఉంది.
అయితే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ భేటీ కాబోతోంది. ఈ నేపథ్యంలో మిగతా కేసుల్ని రిజిస్ట్రీ ఇవాళ లిస్ట్ చేయలేదు. అయితే చంద్రబాబు కేసుపై అత్యవసర విచారణ కోరుతూ ఆయన లాయర్లు సీజేఐకి ఓ మెమో సమర్పించారు. దీంతో సీజేఐ ధర్మాసనం దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది. అయితే ఇవాళ్టికి ఇవాళ విచారణ జరిపి నిర్ణయం ప్రకటించే అవకాశాలు లేకపోవడంతో చంద్రబాబుకు వెయిటింగ్ తప్పేలా లేదు.

మరోవైపు ఎల్లుండి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగకపోతే అక్టోబర్ 3వ తేదీ వరకూ ఎదురుచూడక తప్పదు. దీంతో చంద్రబాబు లాయర్లు సీజేఐని కలిసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో రేపైనా చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. అప్పటివరకూ ఈ ఉత్కంఠ తప్పదు.
అటు విజయవాడ ఏసీబీ కోర్టులోనూ విచారణ ఇవాళ జరిగే పరిస్ధితి లేదు. ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ హిమబిందు ఇవాళ ఒక్కరోజు సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ, బెయిల్ కోరుతూ ఆయన లాయర్లు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడనుంది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఏపీ ఫైబర్ నెట్ అక్రమాల కేసుల్లోనూ సీఐడీ చంద్రబాబు పీటీ వారెంట్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపైనా విచారణ వాయిదా పడినట్లే భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications