కూతురిపై ప్రియుడు కన్నేసినా, తల్లి మద్దతు: వ్యభిచార గృహానికి అమ్మేశారు
చీరాల: ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ చిన్నారిని ఒకరి తర్వాత మరొకరు అమ్ముకున్న షాకింగ్ సంఘటన ఇది. కొద్ది రోజుల క్రితం బాధిత పదకొండేళ్ల బాలిక చీరాల పోలీసుల చెంతకు చేరింది. ఆమె నుంచి పోలీసులు ఆరా తీయగా ఎన్నో విషయాలు తెలిశాయి.
హైదరాబాదులోని బాలాజీనగర్‌కు చెందిన దంపతుల కుమార్తె ఈ బాలిక. తండ్రి ఆటో డ్రైవర్. భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో తల్లి మరొకరితో సహజీవనం చేస్తోంది. ఆ తల్లి కూతురును తనతో పాటు ఉంచేసుకుంది. అయితే, తల్లి ప్రియుడు బాలిక పైన కూడా కన్నేశాడు.
బాలిక పైన పలుమార్లు లైంగిక దాడికి ప్రయత్నించాడు. విషయం తెలిసినప్పటికీ.. ఆ కన్నతల్లి ప్రియుడిని ఏమీ అనలేదు. పైగా కూతురునే బెదిరించింది. ఆ తర్వాత ఆ తల్లి తన కూతురును విజయవాడలోని ఓ మహిళకు అమ్మేసింది. ఆమె మూడు నెలల క్రితం మరో మహిళకు అమ్మేసింది.

సదరు మహిళ వ్యభిచారం నిర్వహిస్తున్న మరో మహిళ వాణికి అమ్మేసింది. ఇలా పదకొండేళ్ల అభం శుభం తెలియని బాలికను ముగ్గురు నలుగురు కొని, అమ్మేశారు. చివరగా కొన్న వాణి ప్రియుడు.. జితిన్ బాలిక పైన పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.
వాణి ఆ బాలికను గుంటూరులోని ఓ గుడికి తీసుకు వెళ్తుండగా ఆటో ప్రమాదం జరిగింది. వాణికి గాయాలయ్యాయి. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక మాత్రం అక్కడి నుంచి తప్పించుకుంది. ఆమె గురించి కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు.. ఆ బాలిక జరిగిన విషయాన్నింటిని చెప్పింది.
బాలికను అనాథగా భావించి విచారణ జరిపితో ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. బాలికను విచారించిన పోలీసులు.. వాణి ప్రియుడు జితిన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో హోంగార్డును కూడా విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదులోని బాలిక కన్నతల్లి, ఆమె ప్రియుడు, ఆమెను కొన్ని మహిళలు, వాణి, ఆమె ప్రియుడి పైన పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications